Ayodhya Temple Trust Preparations for Pilgrims :అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. జనవరి 22న జరిగే మహోత్సవానికి భారీగా భక్తులు వస్తారని ఆలయ ట్రస్ట్ భావిస్తోంది. వారికోసం వేర్వేరు చోట్ల 10 పడకల ఆసుపత్రులను ఏర్పాటు చేస్తోంది.
"వైద్య సేవల కోసం ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం అయోధ్యలోని వేర్వేరు చోట్ల ఏర్పాట్లు చేసింది. దీనితోపాటు.. బాగ్ బ్రిజేశ్వరిలో కడుతున్న 10 పడకల ఆస్పత్రితోపాటు అవకాశం ఉన్న ఇతర కేంద్రాల్లో వైద్యులను ఆలయ ట్రస్ట్ నియమిస్తోంది."
- డా.అనిల్ మిశ్రా, రామ మందిర ట్రస్ట్ సభ్యుడు
ప్రాణప్రతిష్ఠ సమయంలో 12 నుంచి 15 వేల మంది అయోధ్యలో బస చేసేందుకు వీలుగా ఆలయ ట్రస్ట్ ఏర్పాట్లు చేస్తోంది. 'సాధువులు సహా మేము ఆహ్వానించిన ప్రముఖులందరికీ అవసరమైన అన్ని ఏర్పాట్లను ట్రస్ట్ చేస్తోంది. ఇందుకోసం వేర్వేరు బృందాలు పని చేస్తున్నాయి.' అని రామమందిర ట్రస్ట్ సభ్యుడు డా. అనిల్ మిశ్రా వెల్లడించారు.
గుడి నిర్మాణం, భక్తులకు సౌకర్యాల కల్పనకు ఇప్పటివరకు 900 కోట్ల రూపాయలకుపైగా ఖర్చు చేశామని అయోధ్య ట్రస్ట్ కోశాధికారి వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు ఇచ్చిన విరాళాల వల్ల ట్రస్ట్ దగ్గర పుష్కలంగా నిధులు ఉన్నాయని చెప్పారు.
"ట్రస్ట్‌కు కుబేరుని ఆశీర్వాదం ఉంది. మా వద్ద ఇంకా రూ.3వేల కోట్లు మిగిలి ఉన్నాయి."