తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భక్తుల కోసం వందలాది రూమ్స్​ బుక్​​- అతిథులకు పునాది మట్టి, సరయూ నీటితో గిఫ్ట్ ప్యాక్​ - అయోధ్యలో సీఐఎస్​ఎఫ్ సెక్యూరిటీ

Ayodhya Rooms Booking Ram Mandir : అయోధ్య రామయ్య ప్రాణప్రతిష్ఠకు వచ్చే అతిథులకు వసతి, భోజన ఏర్పాట్ల విషయంలో యూపీ ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. అయోధ్యలోని పలు హోటళ్లు, అతిథి గృహాలు, డార్మిటరీల్లో రూమ్​లను బుక్​ చేసింది. మరోవైపు, ప్రాణప్రతిష్ఠకు సమయం దగ్గరపడుతున్న క్రమంలో అధికారులు భద్రతా ఏర్పాట్లను వేగవంతం చేశారు. అధునాతన డ్రోన్లను రంగంలోకి దించారు.

Ayodhya Rooms Booking Ram Mandir
Ayodhya Rooms Booking Ram Mandir

By ETV Bharat Telugu Team

Published : Jan 13, 2024, 10:06 AM IST

Ayodhya Rooms Booking Ram Mandir :మరికొద్ది రోజుల్లో అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం జరగనుంది. ఈ నేపథ్యంలో రామయ్య ప్రాణప్రతిష్ఠకు వచ్చే అతిథులు కోసం వసతి, భోజన ఏర్పాట్ల విషయంలో ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు ఇప్పటికే అయోధ్యలోని హోటళ్లు, ధర్మశాలలు, అతిథి గృహాలు, పేయింగ్ గెస్ట్​లు, టెంట్​ సిటీలు, షెల్టర్​ సైట్లు, డార్మిటరీల్లో రూమ్​లను బుక్​ చేసింది. దాదాపు 30వేల మంది భక్తులకు సౌకర్యాలను కల్పించినట్లు తెలుస్తోంది. 60 హోటళ్లు, 171 ధర్మశాలలు, 17 హాళ్లను బుక్ చేసినట్లు సమాచారం.

అతిథిలకు గిఫ్ట్​లు
ప్రాణప్రతిష్ఠకు వచ్చే అతిథులకు రామజన్మభూమి పునాది మట్టి, నెయ్యితో చేసిన 100 గ్రాముల మోతీచూర్ లడ్డు, ఓ సీసాలో సరయూ నది నీరును బాక్సులో పెట్టి గిఫ్ట్​గా ఇవ్వనున్నట్లు ట్రస్ట్ శుక్రవారం తెలిపింది. అలాగే జనపనార సంచిలో పెట్టి రాముడి చిత్రపటం, ఆలయ ఫొటోను ఇవ్వనున్నట్లు పేర్కొంది. గీతా ప్రెస్​ మతపరమైన పుస్తకాలను గిఫ్ట్​ బాక్సులో ఉంచనున్నట్లు తెలిపింది. మరోవైపు, అయోధ్య రామాలయానికి కాశీ విశ్వనాథ్ విగ్రహం, త్రిశూలం, శివలింగాన్ని కానుకగా ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది విశ్వనాథ్ ఆలయ ట్రస్ట్.

కట్టుదిట్టమైన భద్రత
అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి సమయం దగ్గరపడుతున్న క్రమంలో అధికారులు భద్రతా ఏర్పాట్లను వేగవంతం చేశారు. ప్రధాని సహా సినీ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు ఆలయ ప్రారంభోత్సవానికి రానున్న నేపథ్యంలో బలగాలతో పాటు అధునాతన ఆయుధ వ్యవస్థను రంగంలోకి దించుతున్నారు. అలాగే అయోధ్య జిల్లాలో 10వేల సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అయోధ్య నగరంలోని వ్యూహాత్మక ప్రాంతాలలో యాంటీ డ్రోన్ సాంకేతికతను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సాంకేతికత ద్వారా అనుమానిత డ్రోన్లను గుర్తించడం సహా వాటిని నియంత్రణలోకి తీసుకోవచ్చని ఎస్పీ గౌరవ్ వన్స్వాల్ తెలిపారు.

"ఇది అయోధ్యలో ఏర్పాటు చేస్తున్న యాంటీ డ్రోన్ వ్యవస్థ. ఇజ్రాయెల్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న కంపెనీ వీటిని ఉత్పత్తి చేసింది. ఏదైనా అనధికార డ్రోన్ ఎగురుతుంటే గుర్తించడమే యాంటీ డ్రోన్‌ ప్రధాన విధి. ఇది డ్రోన్‌కు సంబంధించిన టేక్‌ ఆఫ్‌ ప్రదేశంతో పాటు ఎక్కడికి వెళుతుందో మాకు సమాచారం అందిస్తుంది. యాంటీ డ్రోన్ వ్యవస్ అనుమానిత డ్రోన్‌ను తన నియంత్రణలోకి తీసుకుంటుంది. తద్వారా దాన్ని నియంత్రిస్తున్న వ్యక్తి ఆ డ్రోన్‌పై పట్టు కోల్పోతాడు. అనంతరం ఆ అనుమానిత డ్రోన్‌ను తాము ఎక్కడైనా ల్యాండ్‌ చేయడానికి అవకాశం ఉంటుంది."
--గౌరవ్ వన్స్వాల్, ఎస్పీ

యాంటీ డ్రోన్ వ్యవస్థతో పాటు 10 వేలకుపైగా సీసీటీవీలు, ఇతర హైటెక్‌ నిఘా పరికరాలను అమర్చుతున్నారు. 112 పోలీసులు వాహనాలు అయోధ్యలో పెట్రోలింగ్‌ నిర్వహించనున్నాయి. సరయూ నది తీరం వెంబడి కూడా డ్రోన్లతో నిరంతరం పర్యవేక్షించనున్నారు. రామ మందిర ప్రారంభోత్సవం అనంతరం దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు అయోధ్యకు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే భక్తుల భద్రతను దృష్టిలో పెట్టుకొని అధికారులు, పోలీసులు అనేక ఏర్పాట్లు చేస్తున్నారు.

25 సెకన్లలో రాముడి విగ్రహంతో గర్భగుడికి మోదీ- అద్భుత ముహూర్తంలోనే ప్రాణప్రతిష్ఠ

అయోధ్యలో రియల్ ఎస్టేట్​ బూమ్​- భారీగా పెరిగిన రిజిస్ట్రేషన్లు- రూ.కోట్లలో ఆదాయం

ABOUT THE AUTHOR

...view details