Ayodhya Ram Statue Photo :అయోధ్య ఆలయం గర్భగుడిలో ప్రతిష్ఠించిన బాలరాముడి విగ్రహ చిత్రం విడుదల అయింది. విశ్వహిందూ పరిషత్ మీడియా ఇంఛార్జి శరత్ శర్మ ఈ ఫొటోలను విడుదల చేశారు. చిన్నారి రామయ్య నల్లరాతి విగ్రహానికి కళ్ల గంతలు కట్టి ఉంచారు. కర్ణాటకలోని మైసూరుకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ ఈ విగ్రహాన్ని తయారుచేశారు. ఐదేళ్ల బాలుడి రూపంలో ఉన్న రాముడు కమలం పువ్వుపై నిల్చుని ఉన్నాడు. ఈ బాలరాముడి విగ్రహం 51 అంగుళాల ఎత్తు, 1.5 టన్నుల బరువు ఉంది.
నాలుగో రోజు క్రతువులు
మరోవైపుప్రాణప్రతిష్ఠకు ముందు జరిగే క్రతువులునాలుగో రోజుకు చేరాయి. శుక్రవారం ఉదయం ఔషధాధివాస్, కేశరాధివాస్, ఘృతాధివాస్ జరుగుతాయి. సాయంత్రం ధాన్యాధివాస్ నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాలను వారణాసికి చెందిన వేదపండితులు నిర్వహిస్తున్నారు.
ప్రాణప్రతిష్ఠను దీపావళిలా జరుపుకోండి : ప్రధాని మోదీ
అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ పర్వదినాన్ని దీపావళిలా జరుపుకోవాలని కేబినెట్ మంత్రులకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. మంత్రులు వారి ఇళ్ల వద్ద దీపాలు వెలిగించి పేదలకు భోజనం పెట్టాలని కేబినెట్ మీటింగ్ సందర్భంగా మోదీ కోరారు. జనవరి 22 తర్వాత తమ రాష్ట్రాల భక్తులతో కలిసి ఆలయాన్ని సందర్శించాలని కూడా కోరినట్లు సమాచారం.
రైల్వే స్టేషన్లలో ప్రత్యక్షప్రసారం
అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠను దేశవ్యాప్తంగా ప్రయాణికులకు ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది. దాదాపు 9000 స్క్రీన్లు అందుబాటులో ఉన్నట్లు తెలిపింది.
అయోధ్యలో హై-అలర్ట్!
అయోధ్యలో ముగ్గురు అనుమానితులను ఉత్తర్‌ప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) అదుపులోకి తీసుకుంది. వీరికి కెనడాలో హత్యకు గురైన సుఖా డంకే, అర్ష్ దాలా గ్యాంగ్‌లతో సంబంధాలు ఉన్నట్లు వచ్చిన వార్తలు కలకలం రేపాయి. దీంతో అయోధ్యలో పోలీసులు హై-అలర్ట్ ప్రకటించారు. యూపీఏటీఎస్, ఇంటెలిజెన్స్ బ్యూరో- ఐబీ అనుమానితులను గంటల తరబడి విచారించాయి. అయితే వారికి ఏమైనా ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయా లేదా అనే విషయంపై స్పష్టత రాలేదు. అనుమానితుల్లో ఒకరిని రాజస్థాన్‌లోని సీకర్ జిల్లాకు చెందిన ధర్మవీర్‌గా గుర్తించారు.
హర్ష్ దాలాను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ- ఎన్ఐఏ ఉగ్రవాదిగా ప్రకటించింది. అతడు ఇండియా మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్నాడు.
టైర్ కిల్లర్ స్పీడ్ బ్రేకర్లు
ఇదిలా ఉండగా ప్రాణప్రతిష్ఠ కోసం అయోధ్య సిద్ధం అవుతోంది. ప్రాణప్రతిష్ఠ కోసం వచ్చే దాదాపు 8000 మంది అతిథుల బస కోసం ఇప్పటికే తీర్థ క్షేత్రపురం (టెంట్‌సిటీ)ను సిద్ధం చేసింది మందిర ట్రస్టు. దీంతో పాటు భక్తుల కోసం ఆశ్రయస్థల్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది. భక్తులకు అవసరమైన అన్ని వసతులు ఇక్కడ సిద్ధం చేశారు. ఇదిలా ఉండగా, అయోధ్య రాముడి కోసం జైపుర్ నుంచి 5 లక్షల ప్యాకెట్ల ప్రసాదాన్ని పంపించింది విశ్వహిందూ పరిషత్. మరోవైపు ఇప్పటికేభద్రతావలయంలోకి చేరుకున్న అయోధ్యలో తుదిదశ ఏర్పాట్లు జరుగుతున్నాయి. రహదారులపై ఎక్కడికక్కడ టైర్ కిల్లర్ స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేస్తున్నారు.
అయోధ్య వెళ్తున్నారా? రామమందిరంతోపాటు చూడాల్సిన బెస్ట్ ప్లేసెస్ ఇవే! ఓ లుక్కేయండి!
ఉద్యోగులకు గుడ్‌న్యూస్- అయోధ్య గుడి ప్రాణప్రతిష్ఠ రోజున హాఫ్ డే లీవ్