Ayodhya Ram Mandir Unique Features :అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ రామాలయం రూపుదిద్దుకోవడంలో ఆశీశ్ సోంపురా అనే ఆర్కిటెక్ట్ కీలక పాత్ర పోషించారు. వీరి కుటుంబం దాదాపు మూడు దశాబ్దాలుగా అయోధ్య రామమందిరం నిర్మాణంలో పని చేస్తోంది. ఈ నేపథ్యంలో దాదాపు 2500 ఏళ్లు మనుగడ సాగించేలా నిర్మాణం జరుగుతున్న ఈ రామాలయం గొప్పతనాన్ని సోంపురా వివరించారు.
"సాధారణంగా పురాతన కట్టడాలను 500 ఏళ్ల అనాలసిస్‌తో నిర్మిస్తాం. కానీ ఈ ఆలయాన్ని 2500 ఏళ్ల దూరదృష్టితో నిర్మిస్తున్నాం. ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు గానీ భూకంపం కానీ వచ్చినా 2500 ఏళ్ల వరకు చెక్కుచెదరదు"
--ఆశీశ్ సోంపురా, ఆర్కిటెక్ట్
అయోధ్య రామాలయాన్ని భారతీయ సంస్కృతి ప్రతిబింబించేలా నాగర శైలిలో నిర్మిస్తున్నారు. అష్టభుజి ఆకారంలో గర్భగుడిని తీర్చిదిద్దుతున్నారు. భారతదేశంలో గర్భగుడి అష్టభుజి ఆకారంలో ఉన్న దేవాలయాలు చాలా తక్కువ అని ఆర్కిటెక్ట్ ఆశీశ్ సోంపురా తెలిపారు. కానీ అయోధ్య రామాలయం గర్భగుడి ఆ ఆకారంలోనే ఉందని వెల్లడించారు. 'ఇదే ఈ ఆలయ ప్రత్యేకత. అష్టభుజి ఆకారం విష్ణువుతో ముడిపడి ఉంది. ఆలయ శిఖరం కూడా అష్టభుజి ఆకారంలోనే ఉంటుంది. ఉత్తర భారతం, పశ్చిమ, తూర్పు ప్రాంతాల్లో ఎక్కువగా ఉండే నాగర శైలిలో ఆలయాన్ని నిర్మిస్తున్నారు. భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని ఇచ్చేందుకు సహజ సిద్ధంగా ఉండేలా ఆలయాన్ని డిజైన్ చేశాం' అని ఆశీశ్ సోంపురా వివరించారు