Ayodhya Ram Mandir Tunnel :అయోధ్య రామమందిర నిర్మాణ పనులు శరవేగంగా జరగుతున్నాయి. ఇప్పటికే ఆలయ మొదటి అంతస్థు నిర్మాణం చివరి దశకు చేరుకుంది. ఈ క్రమంలోనే దర్శనానికి వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహకులు. లక్షన్నర మంది భక్తులు.. ఒకేసారి ప్రదక్షిణ చేసుకునేలా నిర్మిస్తున్నారు. ఇందుకోసం 800 మీటర్ల పొడవైన గోడను కడుతున్నారు. దీంతో పాటుగా ప్రదక్షిణ చేసుకునే భక్తులు, ఆలయానికి వచ్చే భక్తుల మధ్య ఇబ్బంది తలెత్తకుండా.. ఆలయానికి తూర్పు భాగంలో పొడవైన సొరంగాన్ని నిర్మిస్తున్నారు. సింహద్వారంలోకి భక్తులు ప్రవేశించగానే.. తూర్పు వైపున ప్రధాన ద్వారం ఉంటుంది. ఆ మార్గం గుండా వెళితే నేరుగా ఆలయంలోకి ప్రవేశిస్తారు. దాని పక్కనే బయటకు వెళ్లే దారి కూడా ఉంటుంది. ఈ ద్వారంలో వెళితే.. సొరంగ మార్గం ద్వారా బయటకు వెళతారు. ఈ సొరంగాన్ని ప్రవేశ మార్గం కిందనే నిర్మిస్తున్నారు.
"రాముడి దర్శనం కోసం ఎంత మంది భక్తులు వస్తారనేది ప్రస్తుతానికి అంచనా వేయలేదు. కానీ ఏకకాలంలో లక్షన్నర మంది ప్రదక్షిణ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రదక్షిణ చేసిన తర్వాతనే భక్తులు రాముడి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రవేశ, నిష్క్రమణ దారులను నిర్మిస్తున్నాం."
--వినోద్ మెహతా, ఎల్ అండ్ టీ ప్రాజెక్ట్ మేనేజర్
Ayodhya Ram Mandir Construction Status :మూడు అంతస్తులతో నిర్మించనున్న ఈ మందిరం ఎత్తు 161 అడుగులు ఉంటుంది. రెండున్నర అడుగుల పొడవు ఉన్న 17 వేల రాళ్లను మందిరం నిర్మాణంలో ఉపయోగిస్తున్నారు. వీటిని రాజస్థాన్ నుంచి ప్రత్యేకంగా తెప్పించారు. మందిరం పొడవు 380 అడుగులు, వెడల్పు 250 అడుగులు ఉండనుంది. మొత్తం 8 ఎకరాల విస్తీర్ణంలో ఆలయం నిర్మాణం కొనసాగుతుండగా.. 2.7 ఎకరాల విస్తీర్ణంలో ప్రధాన ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో మరో 6 ఆలయాలను సైతం కడుతున్నారు.