Ayodhya Ram Mandir Statue Selection : ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో కొత్తగా నిర్మితమవుతున్న భవ్యరామ మందిరం మరికొద్ది రోజుల్లోనే భక్తులకు అందుబాటులోకి రానుంది. ఇందుకోసం యావత్ దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామభక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆలయ గర్భగుడిలో ప్రతిష్ఠ చేయనున్న రామయ్య విగ్రహం ఎలా ఉండనుందని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ శుక్రవారం నిర్వహించిన సమావేశంలో మౌఖిక ఓటింగ్ ద్వారా రాముడి విగ్రహాన్ని ఎంపిక చేసినట్లు సమాచారం. దీనిపై ఆధ్యాత్మిక వేత్తల అభిప్రాయం తీసుకోనున్నట్లు తెలిసింది. గర్భగుడిలో బాల రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఇదివరకే ప్రకటించింది.
35 అడుగుల దూరం నుంచే!
Ayodhya Ram Mandir Statue Height : ఆలయ గర్భగుడిలో 51 అంగుళాల ఎత్తుతో ఐదేళ్ల బాలుడి రూపంలో అయోధ్య రామయ్య విగ్రహం ఉండనుంది. ఈ విగ్రహాన్ని భక్తులు 35 అడుగుల దూరం నుంచే రామ భక్తులు దర్శించుకునే వీలుంది. విల్లంబులు ధరించి, కమలంపై కూర్చొని ఉండే ఈ బాల రాముడికి సంబంధించి ముగ్గురు శిల్పులు వేర్వేరు విగ్రహాలను రూపొందించారు.
దైవత్వం ఉట్టిపడే విగ్రహం ఎంపిక!
Ram Mandir Statue Sculpture : అయితే వాటిలో అత్యంత సుందరంగా కనిపించే దైవత్వం ఉట్టిపడే విగ్రహాన్ని ఎంపిక చేయనున్నట్లు ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్ ఇటీవల వెల్లడించారు. దీనిపై శుక్రవారం సమావేశమైన కమిటీ ఒకదాన్ని ఎంపిక చేసినప్పటికీ మరింత మంది అభిప్రాయం తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం.