Ayodhya Ram Mandir Statue Finalized :అయోధ్య రామమందిరంలో ప్రతిష్ఠించడానికి మైసూరుకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కిన విగ్రహాన్ని ఎంపిక చేసినట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ సోమవారం తెలిపారు. 150 నుంచి 200 కిలోల వరకు బరువున్న కొత్త విగ్రహాన్ని జనవరి 18న గర్భగుడిలోకి చేర్చుతామని అన్నారు. జనవరి 22న ప్రాణప్రతిష్ఠ జరుగుతుందని చెప్పారు. గర్భగుడిలో పాత విగ్రహంతో పాటు కొత్త విగ్రహం కూడా ఉంటుందని వెల్లడించారు. జనవరి 16న (మంగళవారం) ప్రాణప్రతిష్ఠకు సంబంధించిన కార్యక్రమాలు మొదలవుతాయని తెలిపారు.
"ప్రాణప్రతిష్ఠ ముహూర్తం వారణాసికి చెందిన గణేశ్వర్ శాస్త్రి ద్రావిడ్ నిర్ణయించారు. ఆయన పర్యవేక్షణలో 121 మంది ఆచార్యాలు సమక్షంలో ప్రాణప్రతిష్ఠకు ముందు నిర్వహించే కార్యక్రమాలు జరగుతాయి. కాశీకి చెందిన లక్ష్మీకాంత్ దీక్షిత్ ప్రధాన ఆచార్యుడిగా ఉంటారు. జనవరి 20, 21 తేదీల్లో భక్తులు దర్శించుకునేందుకు అనుమతి లేదు. జనవరి 22న ఒంటిగంటకల్లా ప్రాణప్రతిష్ఠ పూర్తి అవుతుంది. ఆ తర్వాతి రోజు నుంచి గర్భగుడిలోకి భక్తులను అనుమతిస్తారు"
-- చంపత్ రాయ్, శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి
ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ఉత్తర్‌ప్రదేశ్ గవర్నర్ ఆనందిబెన్ పటేల్, ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్య నాథ్ ఇతర ప్రముఖుల సమక్షంలో రామ విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుందని చంపత్ రాయ్ వెల్లడించారు. భారత్లోని 150పైగా హిందూ సంప్రదాయాలకు చెందిన ఆచార్యులు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. 50పైగా గిరిజన సంప్రదాలకు చెందిన ప్రముఖులు కూడా హాజరు కానున్నట్లు చెప్పారు.