Ayodhya Ram Mandir Pran Pratishtha :అయోధ్య రామమందిర ప్రతిష్ఠాపన మహోత్సవాల సందర్భంగా శ్రీరాముని జీవితంలోని కీలక ఘట్టాలను తెలిపే విధంగా శోభాయాత్ర నిర్వహించనున్నారు. సుమారు 100 విగ్రహాలతో అయోధ్యలో ప్రతిష్ఠాపన మహోత్సవ కార్యక్రమానికి గుర్తుగా జనవరి 17 శోభాయాత్రను నిర్వహిస్తున్నట్లు అయోధ్య రామమందిర ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు. వారం రోజులపాటు జరిగే రామ్‌లల్లా విగ్రహా ప్రతిష్ఠాపనా మహోత్సవాలను ఈ శోభాయాత్రతోనే శ్రీకారం చుట్టనున్నారు. శ్రీరాముని జననం నుంచి వనవాసం, లంకపై విజయం, అయోధ్యకు తిరిగి రావడం వంటి కీలక ఘట్టాలు తెలిపే విధంగా విగ్రహాలు ఉంటాయని ప్రధాన శిల్పి రంజిత్ మండల్ తెలిపారు.
"ఈ విగ్రహాలను తయారు చేసే అవకాశం నాకు లభించడాన్ని అదృష్టంగా భావిస్తున్నాను. వివిధ దశల్లో మొత్తం 100 విగ్రహాలను ప్రదర్శిస్తారు. వీటిలో ఇప్పటి వరకు 60 విగ్రహాలు సిద్ధం చేశాం."
-రంజిత్ మండల్, ప్రధాన శిల్పి
నూతనంగా నిర్మించిన రామమందిర గర్భగుడిలో రామ్‌లల్లా విగ్రహాన్ని ఉంచుతారు. పాలరాతితో చేసిన తామరపుష్ప సింహాసనంపై రామ్ లల్లా విగ్రహాన్ని ఉంచనున్నారు. శ్రీరామనవమి రోజు మధ్యాహ్నం 12 గంటలకు సూర్యకిరణాలు రామ్‌లల్లా నుదిటిని తాకి, గర్భగుడిని కాంతిమయం చేసేవిధంగా సింహాసనం ఎత్తును నిర్ణయించనున్నారు. జనవరి 22న రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరగనుంది. ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో పాటు వందలాది మంది ప్రముఖులు హాజరుకానున్నారు.