Ayodhya Ram Mandir Pran Pratishtha :అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ జరిగే రోజు జాతీయ సెలవు ప్రకటించాలని డిమాండ్ చేశారు ఓ సాధువు. 2024 జనవరి 22న దేశవ్యాప్తంగా సెలవు దినంగా ప్రకటించాలని మహారాష్ట్రకు చెందిన సాధువు మహంత్ అంకిత్ శాస్త్రి మహారాజ్ కోరారు. ఫలితంగా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని వీక్షించే అవకాశం దక్కుతుందని తెలిపారు. వారం రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. 130 దేశాల ప్రతినిధులతో పాటు అనేక మంది సాధువులు రానున్నారు. తాజాగా శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ రామమందిర గర్భగుడి చిత్రాన్ని ఎక్స్ వేదికగా షేర్ చేశారు.
భక్తుల కోసం టెంట్లు ఏర్పాటు
మరోవైపు నెలరోజుల్లో ప్రారంభయ్యే అయోధ్య రామమందిరం ఉత్సవానికి వచ్చే భక్తులకోసం అయోధ్య అభివృద్ధి సంస్థ (ADA)టెంట్‌లను నిర్మించింది. ఓ ప్రైవేటు సంస్థతో కలిసి జర్మన్ టెక్నాలజీతో దాదాపు 30వాటర్ ప్రూఫ్ టెంట్‌లను ఏర్పాటు చేసినట్లు ADA వెల్లడించింది. రామాలయ ప్రారంభోత్సవానికి దేశం నలుమూలల నుంచి భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున, ఈ టెంట్‌లను సిద్ధం చేసినట్లు తెలిపింది. అయితే వాటికోసం ముందుగానే బుక్ చేసుకోవాలని సూచించింది.