Ayodhya Ram Mandir Pran Pratishtha :అయోధ్య రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకు సమయం దగ్గరపడుతున్న వేళ దేశవ్యాప్తంగా భక్తులు పంపిన కానుకలు అయోధ్యకు చేరుకుంటున్నాయి. గుజరాత్‌లోని వడోదర నుంచి వచ్చిన 108 అడుగుల పొడవు, 3వేల 403 కిలోల బరువైన బాహుబలి అగరుబత్తిని అయోధ్యలో వెలిగించారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్ నృత్యగోపాల్ దాస్ జీ మహారాజ్ సమక్షంలో ఈ బాహుబలి అగరుబత్తిని భక్తులు వెలిగించారు. గుజరాత్‌లోని వడోదరా నగర తర్సాలీ ప్రాంతానికి చెందిన కొందరు భక్తులు అయోధ్య రామమందిరం కోసం బాహుబలి అగరుబత్తిని తయారుచేశారు.
ఈ బాహుబలి అగరుబత్తిని పంచ ద్రవ్యాలతో తయారుచేశారు. 3.5 అడుగుల చుట్టుకొలత ఉన్న దీని తయారీకి దాదాపు రెండు నెలల సమయం పట్టింది. 191 కిలోల ఆవునెయ్యి, 376 కిలోల గుగ్గిలం పొడి, 280 కిలోల బార్లీ, 280 కిలోల నువ్వులు, 376 కిలోల కొబ్బరిపొడి, 425 కిలోల పూర్ణాహుతి సామగ్రి, 1,475 కిలోల ఆవుపేడను దీని తయారీకి వాడారు. ఇందుకు దాదాపుగా 5 లక్షల రూపాయల ఖర్చయింది.
రాముడి కోసం వెండి పూజా సామగ్రి
అయోధ్యరామ మందిరంలో రాముల వారి పూజ కోసం వెండితో పూజా సామగ్రిని తయారు చేశారు. స్వచ్ఛమైన వెండితో వీటిని చెన్నైకు చెందిన ఆభరణాల సంస్థ రూపొందించింది. రామ మందిరంలో రోజువారీ పూజా కార్యక్రమాల్లో భాగంగా వీటిని ఉపయోగించనున్నారు.