Ayodhya Ram Mandir Opening Leave :అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం నేపథ్యంలో కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అన్ని కార్యాలయాలకు జనవరి 22న సగం రోజు సెలవును ప్రకటించింది. మధ్యాహ్నం 2.30 గంటల వరకే కార్యాలయాలను నడుస్తాయని వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం ప్రాణప్రతిష్ఠ వేడుకల్లో ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొనేలా చేస్తుందని తెలిపింది. కేంద్ర ప్రభుత్వ పరిధిలో నడిచే కార్యాలయాలు, సంస్థలు, పరిశ్రమలకు ఇది వర్తిస్తుందని చెప్పింది. ప్రాణప్రతిష్ఠ రోజున సగం రోజు సెలవు ప్రకటించడంపై కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ జితేంద్ర సింగ్ స్పందించారు. ప్రజల విశ్వాసాలను దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా సెలవు ఇవ్వాలని అనేక విజ్ఞప్తులు వచ్చాయని ఆయన వివరించారు. మరోవైపు ప్రభుత్వ, ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఈనెల 22న సగం రోజు సెలవు ప్రకటించింది కేంద్ర ఆర్థిక శాఖ. ఎస్‌బీఐ సహా ప్రభుత్వ రంగ బ్యాంకులకు సర్కులర్ జారీ చేసింది.
అనేక రాష్ట్రాల్లో సెలవు
ఇప్పటికే దేశంలోని అనేక రాష్ట్రాలు ప్రాణప్రతిష్ఠ జరిగే జనవరి 22ను సెలవు దినంగా ప్రకటించాయి. ఉత్తర్ప్రదేశ్, గోవా, మధ్యప్రదేశ్, హరియాణా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు సెలవు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. మరోవైపు జనవరి 22ను జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఓ న్యాయవాది లేఖ రాశారు.