Ayodhya Ram Mandir Opening Invitation : ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిర ప్రారంభోత్సవానికి శుభ ముహూర్తం సమీపిస్తోంది. వచ్చే ఏడాది జనవరి 22న నిర్వహించనున్న ఈ మహత్తర కార్యక్రమానికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీకి ఇప్పటికే ఆహ్వానంఅందింది. అయితే శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ పిలుపు మేరకు ఈ వేడుక కోసం.. దేశ, విదేశాల్లోని 10 కోట్లకుపైగా కుటుంబాలను ఆహ్వానించనున్నట్లు విశ్వహిందూ పరిషత్ వెల్లడించింది.
"జనవరి 22వ తేదీన అయోధ్య రామమందిరంలో జరిగే ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొనేందుకు 10 కోట్ల కుటుంబాలను ఆహ్వానించనున్నాం. ఇతర హిందూ సంస్థలతో కలిసి వీహెచ్‌పీ కార్యకర్తలు.. జనవరి 1 నుంచి 15 వరకు దేశంలోని వివిధ నగరాలు, గ్రామాలకు వెళ్లి కుటుంబాలను ఆహ్వానించనున్నారు. ఆహ్వాన పత్రికతో పాటు ప్రతి కుటుంబానికి రాముడు, అయోధ్య మందిర చిత్రాన్ని అందించనున్నాం. ఆ సమయంలో భక్తుల నుంచి ఎలాంటి విరాళం, సామగ్రి స్వీకరించబోం. విదేశాల్లో నివసిస్తున్న హిందువులను మరో కార్యక్రమం ద్వారా ఆహ్వానిస్తాం" అని విశ్వ హిందూ పరిషత్ వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్ కుమార్ తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా 5 లక్షలకుపైగా దేవాలయాల్లో..
Ayodhya Ram Mandir Opening Date :మరోవైపు.. పవిత్ర 'అక్షత కలశం'తో కూడిన దేశవ్యాప్త యాత్ర అయోధ్య నుంచి ఇప్పటికే ప్రారంభమైందని అలోక్ కుమార్ తెలిపారు. జనవరి 22వ తేదీన.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులంతా తమ సమీప దేవాలయాల్లో గుమిగూడి పూజలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా 5 లక్షలకుపైగా దేవాలయాల్లో ఈ వేడుకలు జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నామని అన్నారు. ఆ రోజు అయోధ్యలో జరిగే మహాభిషేక కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తామని తెలిపారు. ఆ చారిత్రక ఘట్టాన్ని ప్రజలంతా ఆస్వాదించాలని కోరారు.