Ayodhya Ram Mandir Opening Date :ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరంలో గ్రౌండ్ ఫ్లోర్ పనులు... డిసెంబరు చివరి కల్లా పూర్తవుతాయని ఆలయ నిర్మాణ కమిటీ ఛైర్‌పర్సన్ నృపేంద్ర మిశ్రా వెల్లడించారు. వచ్చే ఏడాది జనవరి 20 నుంచి 24 తేదీల మధ్య రామ్‌లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరిగే అవకాశం ఉందని ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతారని చెప్పారు. అయితే, ప్రధాని మోదీ ఏ రోజున స్వామివారి సేవలో పాల్గొంటారన్న అంశంపై.. ప్రధానమంత్రి కార్యాలయం(PMO) స్పష్టమైన సమాచారం ఇవ్వాల్సి ఉందని చెప్పారు.
రాముడిపై సూర్యకిరణాలు పడేలా ఏర్పాట్లు
Ayodhya Ram Mandir Inauguration : మరోవైపు ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజున ఆలయ గర్భగుడిలోని రాముడి నుదిటిపై సూర్యకిరణాలు పడేలా ఆలయ శిఖరంపై ఒక ఉపకరణాన్ని పెడతామని వివరించారు. ఆ ఉపకరణానికి సంబంధించిన డిజైన్ పనులు బెంగళూరులో శాస్త్రవేత్తలు పర్యవేక్షణలో జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఆలయ నిర్మాణం కోసం రూ. 900 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. జనవరిలో జరిగే ప్రారంభోత్సవానికి 10 వేల మందిని ఆహ్వానించేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన ప్రాథమిక జాబితా తయారీ తుది దశలో ఉన్నట్లు వెల్లడించారు. దీనికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని పుణె, రూర్కీలోని సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ సంయుక్తంగా అందిస్తోందని ఆయన తెలిపారు.