Ayodhya Ram Mandir Latest Update :అయోధ్య రామమందిరాన్ని పూర్తి ఆత్మనిర్భరతతో నిర్మిస్తున్నట్లు ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ వెల్లడించారు. అయోధ్య నగర పారిశుద్ధ్య, నీటి సరఫరా వ్యవస్థలపై భారం పడకుండా ఉంటుందని చెప్పారు. రామాలయానికి ప్రత్యేకంగా మురుగు, మంచి నీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వృద్ధులు, దివ్యాంగులు సులభంగా దర్శించుకునేలా సౌకర్యాలు చేసినట్లు తెలిపారు. ఆలయంలో హెల్త్ కేర్ సెంటర్‌తో పాటు టాయిలెట్ బ్లాక్, ఒకేసారి 25 వేల మంది భక్తులు తమ వస్తువులను పెట్టుకునేలా ఏర్పాట్లు చేశామన్నారు. అయోధ్యలోని ట్రస్ట్ కార్యాలయంలో కాంప్లెక్స్‌కు సంబంధించిన ల్యాండ్‌స్కేప్ ప్లాన్‌ను ఆయన వెల్లడించారు.
70 ఎకరాల్లో నిర్మితమవుతున్న కాంప్లెక్స్‌లో 70 శాతం పచ్చదనమే ఉంటుందన్నారు చంపత్ రాయ్. ఆత్మనిర్భర్ విధానంతో రెండు STPలు, ఒక WTP, ఆలయం కోసం ప్రత్యేకంగా విద్యుత్ సదుపాయాన్ని కల్పించినట్లు చెప్పారు. ఆలయంలో సొంతంగా ఓ అగ్నిమాపక వాహనాన్ని అందుబాటులో ఉంచామని తెలిపారు. ఆలయంలో 392 పిల్లర్లను నిర్మించినట్లు వివరించారు. 14 అడుగుల వెడల్పుతో 732 మీటర్ల వైశాల్యంతో ఆలయ గోడలను నిర్మిస్తున్నట్లు చెప్పారు. లిఫ్ట్ సౌకర్యంతో పాటు వృద్ధులు, దివ్యాంగుల కోసం రెండు ర్యాంపులు ఏర్పాటు చేసినట్లు వివరించారు. అయోధ్యలో కుబేర్ తిలపై జటాయు విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లు తెలిపారు.
"తొలి దశ ఆలయ నిర్మాణం దాదాపు పూర్తి కావొచ్చింది. భక్తులు తూర్పు నుంచి ఆలయంలోకి ప్రవేశించి దక్షిణం నుంచి బయటకు వస్తారు. భక్తులు ఆలయంలోకి వెళ్లాలంటే 32 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. ఆలయాన్ని సంప్రదాయ నాగర పద్ధతిలో నిర్మించాం. 380 మీటర్ల పొడవు, 250 అడుగుల వెడల్పు, 161 అడుగుల ఎత్తులో ఆలయాన్ని నిర్మించాం. జీ ప్లస్ 2 పద్ధతిలో నిర్మించగా, ప్రతి ఫ్లోర్ 20 అడుగుల ఎత్తులో ఉంటుంది. మొత్తం 392 పిల్లర్లు, 44 తలుపులు ఉంటాయి. 14 అడుగుల వెడల్పుతో 732 మీటర్ల వైశాల్యంతో ఆలయ గోడలను నిర్మిస్తున్నాం. ఈ తరహా నిర్మాణం కేవలం దక్షిణాదిలోని కనిపిస్తోంది. ఈ నిర్మాణాన్ని సూర్యుడు, అమ్మవారికి, గణేషుడు, శివుడికి అంకింతం చేస్తున్నాం."
--చంపత్ రాయ్, ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి
9 దేశాలు సమయం చెప్పే గడియారం రాముడికి కానుక
అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠకు సమయం సమీపిస్తున్న తరుణంలో నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. దేశంతో పాటు విదేశాల నుంచి కూడా రాముడికి కానుకలు సమర్పిస్తున్నారు భక్తులు. ఉత్తర్‌ప్రదేశ్ లఖ్‌నవూకు చెందిన కూరగాయల వ్యాపారి ఓ ప్రత్యేక గడియారాన్ని రూపొందించి అందించాడు. ఐదు సంవత్సరాలు కష్టపడి 9 దేశాలకు సంబంధించిన సమయాన్ని తెలిపేలా ఓ గడియారాన్ని రూపొందించాడు అనిల్ సాహూ. కేంద్ర ప్రభుత్వం నుంచి పేటెంట్‌ను సైతం పొందాడు. ఈ గడియారాన్ని ట్రస్ట్ కార్యదర్శికి పంపించి, రామమందిర కాంప్లెక్స్‌లో దీనిని పెట్టాలని కోరాడు.