Ayodhya Ram Mandir Idol :ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో నూతనంగా నిర్మితమవుతున్న భవ్యరామ మందిరంలో ప్రాణప్రతిష్ఠ చేయనున్న రాముడి విగ్రహాన్ని ఆలయ కమిటీ త్వరలోనే నిర్ణయించనుంది. ఈ విషయాన్ని ట్రస్ట్ అధికారులు తెలిపారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు చెందిన మతపరమైన కమిటీ డిసెంబర్ 15న విగ్రహాన్ని ఖరారు చేయనున్నట్లు వెల్లడించారు.
"కర్ణాటక, రాజస్థాన్ నుంచి తెప్పించిన భారీ రాళ్లలతో కళాకారులు మూడు విగ్రహాలను చెక్కుతున్నారు. 90 శాతం సిద్ధమయ్యాయి. తుదిమెరుగులు దిద్దుతున్నారు. డిసెంబర్ 15వ తేదీన ఉత్తమ విగ్రహాన్ని నిర్ణయిస్తాం. అదే విగ్రహాన్ని 2024 జనవరి 22వ తేదీన ప్రధాని మోదీ ప్రాణప్రతిష్ఠ చేయనున్నారు" అని శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. మూడు విగ్రహాలను కళాకారులు గణేష్ భట్, అరుణ్ యోగిరాజ్ సత్యనారాయణ పాండే చెక్కుతున్నారు.
కోహ్లీ, సచిన్‌కు ఆహ్వానం
మరోవైపు, అయోధ్య రామ మందిర ప్రతిష్టాపన మహోత్సవానికి క్రికెట్ దిగ్గజాలు సచిన్ తెందుల్కర్, విరాట్ కోహ్లీ, బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్, పారిశ్రామికవేత్తలు ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీల సహా 7,000 మందిని ఆహ్వానించినట్లు రామమందిరం ట్రస్ట్ తెలిపింది. ప్రముఖ టీవీ సీరియల్ రామాయణంలో సీతారాముల పాత్రలు పోషించిన అరుణ్ గోవిల్, దీపికా చిక్లియాకు కూడా ఆహ్వానించినట్లు చెప్పింది.
న్యాయమూర్తులు, శాస్త్రవేత్తలకు కూడా ఆహ్వానం
ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు కార్యక్రమానికి 50 దేశాల నుంచి ఒక్కొక్కరిని ఆహ్వానించేందుకు కృషి చేస్తున్నామన్నామని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. రామాలయ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన 50 మంది కరసేవకుల కుటుంబ సభ్యులను కూడా ఆహ్వానించామని చెప్పారు. న్యాయమూర్తులు, శాస్త్రవేత్తలు, రచయితలు, కవులకు కూడా ఆహ్వానాలు పంపామని తెలిపారు. వీరితో పాటు సాధువులు, పూజారులు, మతపెద్దలు, మాజీ సివిల్ సర్వెంట్లు, రిటైర్డ్ ఆర్మీ అధికారులు, న్యాయవాదులు, సంగీత విద్వాంసులు, పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డు గ్రహీతలను ఆహ్వానించినట్లు వెల్లడించారు.
వార్తాపత్రికలు, రచనల ద్వారా రామ మందిర ఉద్యమానికి మద్దతిచ్చిన జర్నలిస్టులను కూడా ఆహ్వానించామని విశ్వహిందూ పరిషత్ శరద్ శర్మ తెలిపారు. వారు లేకుంటే రామ మందిరం కోసం ఈ పోరాటం అసంపూర్తయ్యాదని అన్నారు. 7వేల మంది ఆహ్వానితుల్లో 4వేల మంది మత పెద్దలు ఉన్నట్లు చెప్పారు. మిగతా మూడు వేల మంది వీవీఐపీలు ఉంటారని వెల్లడించారు. వేడుకకు మందు రిజిస్టేషన్ లింక్ ఆహ్వానితులకు పంపుతామని తెలిపారు. ఆ లింక్‌లో రిజిస్టేషన్ చేసుకుంటే బార్ కోడ్ వస్తుందని వెల్లడించారు. దానినే ఎంట్రీ పాస్‌గా వినియోగించాలని వివరించారు.
అయోధ్య రామయ్య ప్రాణప్రతిష్ఠకు ఆహ్వానాలు- పోస్ట్ ద్వారా 4వేల మంది సాధువులకు ఇన్విటేషన్
అయోధ్య రాముడికి 2,500 కేజీల భారీ గంట- ఓంకార నాదం వచ్చేలా తయారీ