తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అయోధ్య రాముడికి సూర్యాభిషేకం.. విగ్రహం నుదుటిపై కిరణాలు పడేలా ఏర్పాట్లు - Ayodhya Ram temple

Ayodhya Ram Mandir : అయోధ్య ఆలయంలోని శ్రీరాముడి విగ్రహంపై సూర్యకిరణాలు పడేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఏటా శ్రీరామనవమి రోజున సూర్య కిరణాలు గర్భగుడిలోకి ప్రసరించేలా.. ప్రత్యేక నిర్మాణాలు చేపడుతున్నారు.

ayodhya-ram-mandir-construction
ayodhya-ram-mandir-construction

By

Published : May 31, 2023, 9:29 AM IST

Ayodhya Ram Mandir : ఉత్తర్​ప్రదేశ్​లోని అయోధ్యలో నిర్మితమవుతున్న రామాలయానికి అదనపు హంగులు జోడిస్తున్నారు. ఆలయ గర్భగుడిలోని రాముడి విగ్రహాన్ని సూర్యకిరణాలు తాకేలా ఏర్పాట్లు చేస్తున్నారు. శాస్త్రీయంగా ఈ ప్రక్రియ జరిగేలా చూస్తున్నారు. ఇందుకోసం రామాలయ ప్రాంగణంలో ప్రత్యేక నిర్మాణం చేపట్టనున్నారు. ఇది పూర్తైతే ఏటా శ్రీరామనవమి రోజున మధ్యాహ్నం 12 గంటలకు సూర్య కిరణాలు.. రాముడి విగ్రహం నుదిటిపై పడతాయి.

ప్రత్యేక నిర్మాణం ఇదే..
అయోధ్యలోని శ్రీరామ మందిరం ప్రాంగణంలో.. ప్యాసెంజర్ ఫెసిలిటేషన్ సెంటర్​ను నిర్మించనున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విద్యుదీకరణ పనులు కొనసాగుతున్నాయి. అయితే, ఈ భవనం పైభాగంలో ప్రత్యేక నిర్మాణాలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. రాముడి విగ్రహంపై సూర్యకిరణాలు పడేలా.. శాస్త్రవేత్తల పర్యవేక్షణలో నిర్మాణాలు చేయనున్నారు. ఓ పైప్​ను అమర్చి.. ఆధునిక లెన్సుల ద్వారా సూర్య కిరణాలను ప్రసరింపజేయనున్నారు. రామ్​లల్లా విగ్రహం నుదుటిపై సూర్యకిరణాలు పడేలా ఈ ఏర్పాట్లు చేయనున్నారు.

రామ మందిర నిర్మాణం
రామ మందిర నిర్మాణం

నవంబర్ నాటికే గ్రౌండ్​ ఫ్లోర్ రెడీ!
మరోవైపు, రామ మందిర నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం గర్భగుడి కోసం రాతి స్తంభాలను చెక్కుతున్నారు. ఈ మేరకు.. రామ మందిర నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్ర.. మంగళవారం పనులను పరిశీలించారు. అనంతరం, ఎల్ అండ్ టీ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. నివేదికను పరిశీలించిన నృపేంద్ర మిశ్ర.. నవంబర్ నాటికి ఆలయం గ్రౌండ్ ఫ్లోర్​ను పూర్తి చేయాలని ఆదేశించారు. సోమవారం సాయంత్రం ట్రస్టు కోశాధికారి గోవింద్ దేవ్ గిరి, ప్రధాన కార్యదర్శి చంపత్​రాయ్​లు.. రామసేవకపురంలో జరుగుతున్న పనులను పరిశీలించారు.

పనుల పరిశీలన

డిసెంబర్ లోపు గ్రౌండ్ ఫ్లోర్​ను పూర్తి చేయాలని తొలుత లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ గడువుకు ఇంకా ఆరు నెలలు మాత్రమే సమయం ఉంది. ఈ నేపథ్యంలో పనుల వేగాన్ని పెంచేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఆలయ నిర్మాణం జూన్ నెలలో మరింత వేగంగా జరిగేలా చర్యలు చేపట్టారు. గ్రౌండ్ ఫ్లోర్​లో పనులు 80 శాతానికి పైగా పూర్తైనట్లు తెలుస్తోంది. త్వరలో మార్బుళ్లు పరుస్తారని సమాచారం. పైకప్పు పనులు 70 శాతం పూర్తయ్యాయి. జూన్​లోనే ఈ పనులు పూర్తి చేయాలని భావిస్తున్నారు.

రామ మందిర నిర్మాణం

రంగంలోకి హైదరాబాదీ కళాకారులు
ఆలయం గ్రౌండ్ ఫ్లోర్​లో 44 తలుపులను అమర్చనున్నారు. ఇందుకోసం మహారాష్ట్ర నుంచి భారీగా టేకు కలపను తీసుకొచ్చారు. తలుపులను తయారు చేసేందుకు హైదరాబాద్ నుంచి పది మంది కళాకారులు అయోధ్యకు చేరుకున్నారు. ఆలయ పరిసరాల్లోనే తలుపులు సిద్ధం కానున్నాయి. పైకప్పు పనులు పూర్తి కాగానే.. తలుపులు అమర్చడం ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఎలక్ట్రికల్ వైరింగ్ పనులు పూర్తైతే.. తొలి దశ నిర్మాణం అయిపోయినట్లే.

ABOUT THE AUTHOR

...view details