Ayodhya Ram Mandir Construction: ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణం శరవేగంగా సాగుతోంది. నిర్ణీత గడువులోగా నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు ఆలయ కమిటీ అన్ని చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే 40 శాతం పనులు పూర్తి చేసినట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ వెల్లడించారు. ప్రస్తుతం గర్భగుడి పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఆలయ నిర్మాణ పనులపై సంతృప్తి వ్యక్తం చేసిన ఆయన.. ఏడు రాళ్ల వరుసను పేరుస్తున్నట్లు వివరించారు. ఆలయ ప్రారంభ ద్వారం నుంచి మొదటి అంతస్తులోని సింహద్వారం వరకు గర్భగుడి పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఆలయ నిర్మాణం పూర్తిగా శాస్త్రీయ పద్ధతిలోనే జరుగుతోందని.. రాళ్ల మధ్యలో మిల్లీమీటర్ ఖాళీ లేకుండా నిర్మిస్తున్నామని వివరించారు. 2023 డిసెంబర్‌లోగా ఆలయ నిర్మాణం పూర్తవుతుందని అన్నారు.
2.7 ఎకరాల విస్తీర్ణంలో ప్రధాన ఆలయాన్ని నిర్మిస్తున్నారు. మందిరం పొడవు 380 అడుగులు, వెడల్పు 250 అడుగులు ఉండనుంది. మూడు అంతస్తులతో నిర్మించనున్న ఈ మందిరం ఎత్తు 161 అడుగులు ఉంటుంది. రెండున్నర అడుగుల పొడవు ఉన్న 17 వేల రాళ్లను మందిరం నిర్మాణంలో ఉపయోగిస్తున్నారు. అయోధ్యలో రామాలయం నిర్మాణానికి మార్గం సుగమం చేస్తూ 2019లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. 2020 ఆగస్టు 5న అయోధ్య రామ మందిర నిర్మాణం లాంఛనంగా ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. వేద మంత్రాల మధ్య ఆలయానికి పునాది రాయి వేశారు. అప్పటి నుంచి నిర్మాణ పనులు చకచకా జరిగిపోతున్నాయి.