Ayodhya Ram Mandir Congress :అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి హాజరుకాకూడదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, అగ్రనేత సోనియా గాంధీ, లోక్‌సభలో కాంగ్రెస్ పక్షనేత అధీర్ రంజన్ చౌదరి నిర్ణయించారు. ఆలయ ట్రస్ట్ ఆహ్వానాన్ని తిరస్కరిస్తున్నట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ బుధవారం ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు. జనవరి 22న ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో జరిగే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్/భారతీయ జనతా పార్టీ రాజకీయ ప్రాజెక్ట్‌గా అభివర్ణించారు.
"అయోధ్యలో జనవరి 22న జరిగే రామాలయం ప్రాణప్రతిష్ఠకు హాజరుకావాలని కోరుతూ గత నెల మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, అధీర్ రంజన్ చౌదరికి ఆహ్వానం అందింది. మన దేశంలో రాముడిని కోట్లాది మంది ఆరాధిస్తారు. మతం అనేది వ్యక్తిగత విషయం. కానీ ఆర్ఎస్ఎస్/బీజేపీ కలిసి అయోధ్య రామాలయాన్ని రాజకీయ ప్రాజెక్ట్‌గా మార్చారు. ఎన్నికల్లో లబ్ధి కోసమో ఇంకా నిర్మాణం పూర్తికాకముందే అయోధ్య ఆలయాన్ని బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలు ప్రారంభిస్తున్నారు. అయోధ్య కేసులో సుప్రీంకోర్టు 2019లో ఇచ్చిన తీర్పును, దేశంలోని కోట్లాది మంది రామ భక్తుల మనోభవాలను గౌరవిస్తూనే ఈ ఆహ్వానాన్ని ఖర్గే, సోనియా గాంధీ, అధీర్ రంజన్ తిరస్కరిస్తున్నారు" అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు జైరాం రమేశ్.
కాంగ్రెస్‌పై బీజేపీ ఫైర్
అయోధ్య రామాలయం ప్రాణప్రతిష్ఠకు హాజరుకారాదని కాంగ్రెస్ అగ్రనేతలు తీసుకున్న నిర్ణయాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా తప్పుబట్టింది. "కాంగ్రెస్ పార్టీ 'రామ వ్యతిరేక వైఖరి' దేశ ప్రజలందరికీ తెలిసింది. రాముడు కల్పిత పాత్ర అని సోనియా గాంధీ నేతృత్వంలో న్యాయస్థానంలో అఫిడవిట్ వేసిన ఆ పార్టీ ఇప్పుడు రామాలయం ప్రాణప్రతిష్ఠ ఆహ్వానాన్ని తిరస్కరించడం ఆశ్చర్యకరం ఏమీ కాదు. సోనియా గాంధీ, కాంగ్రెస్ నేతృత్వంలోని 'ఇండియా' కూటమి మరోసారి సనాతన ధర్మాన్ని అవమానించింది. ఇప్పుడు ప్రాణప్రతిష్ఠ ఆహ్వానాన్ని తిరస్కరించడం ఇండియా కూటమి నేతల సనాతన ధర్మ వ్యతిరేక మనస్తత్వాన్ని తెలియజేస్తుంది." అని కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ మండిపడ్డారు.
వారం ముందు నుంచే పూజలు
Ram Mandir Opening Schedule :మరోవైపు, జనవరి 22న జరిగే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి వారం రోజుల ముందు నుంచే పూజలు ప్రారంభం కానున్నాయి. జనవరి 16న విగ్రహాన్ని చెక్కిన ప్రాంగణంలో పూజలు చేసి శిల్పిని సన్మానిస్తారని వీహెచ్‌పీ అధికార ప్రతినిధి అశోక్ తివారీ ఇటీవలే చెప్పారు. 17న గర్భగుడిని సరయూ నదీ జలాలతో సంప్రోక్షణ చేస్తారు. 18న గంధం, సుగంధితో, 19న ఉదయం ఫలాలతో సాయంత్రం చిరుధాన్యాలతో పూజలు చేస్తారు. 20న ఉదయం పూలతో సాయంత్రం నెయ్యితో రాముడికి పూజలు నిర్వహిస్తారు. 21న తేనె, స్వీట్లను అందించి రాముడిని నిద్రబుచ్చనున్నారు. అనంతరం 22న ప్రాణప్రతిష్ఠ జరిగే రాముడి కళ్లగంతలు విప్పి అద్దంలో చూపించనున్నారు.