Ayodhya Ram Mandir Aarti Pass :ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న అయోధ్య రామాలయంలో హారతి కార్యక్రమానికి హాజరయ్యేందుకు భక్తులను ఆహ్వానిస్తోంది ఆలయ ట్రస్టు. ఇప్పటివరకు ఆఫ్లైన్లో జారీ చేస్తున్న పాసులను ఆన్లైన్లోనూ అందుబాటులో ఉంచింది. ప్రారంభోత్సవం అనంతరం రోజుకు మూడు పూటలు హారతి కార్యక్రమం ఉంటుందని ఆలయ ట్రస్టు అధికారులు తెలిపారు. భక్తులకు ఉచితంగానే ఈ పాసులను అందిస్తోంది ట్రస్టు. హారతి కార్యక్రమానికి 30 మంది భక్తులకే అనుమతి ఉంటుందని సంబంధిత సెక్షన్ మేనేజర్ ధ్రువేశ్ మిశ్ర స్పష్టం చేశారు.
"రామజన్మభూమిలో రోజుకు మూడుసార్లు హారతి కార్యక్రమం ఉంటుంది. ఉదయం శృంగార హారతి, మధ్యాహ్నం భోగ హారతి, సాయంత్రం సంధ్యా హారతి నిర్వహిస్తారు. ఎవరి దగ్గర అయితే పాసులు ఉంటాయో వారే హారతి కార్యక్రమానికి వెళ్లే అవకాశం ఉంటుంది. నిబంధనల ప్రకారం ప్రస్తుతానికి 30 మంది వెళ్లేందుకు మాత్రమే అనుమతి ఉంది. ఆన్లైన్లోనూ ఈ సేవ అందుబాటులో ఉంది. రామజన్మభూమి అధికార వెబ్సైట్లో హారతి పాసు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత ఇక్కడి వచ్చి కేంద్రంలో పాసులు తీసుకొని హారతికి వెళ్లొచ్చు."
-ధ్రువేశ్ మిశ్ర, ఆయోధ్య రామాలయం హారతి పాసుల సెక్షన్ మేనేజర్