Ayodhya Deepotsav 2023 : దివ్వెల పండుగ దీపావళి వేళ.. అయోధ్య నగరం దేదీప్యమానంగా వెలిగిపోయింది. సరయూ నదీ తీరంలో 51 ఘాట్లలో వెలిగించిన దాదాపు 22.23 లక్షల దీపాల వెలుగులో ధగధగలాడింది. శ్రీరామ జన్మభూమి అయోధ్యలో జరిగిన ఏడో దీపోత్సవం.. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది.
ఈ కార్యక్రమాన్ని ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మహాహారతి ఇచ్చి ప్రారంభించారు. గత తొమ్మిదేళ్లలో దేశంలో ప్రధాని మోదీ స్థాపించిన 'రామరాజ్యం' పునాదిని అయోధ్య మందిర నిర్మాణం బలపరుస్తుందని యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. ఈ దీపోత్సవం ద్వారా ఉజ్జయిని పేరిట ఉన్న 18లక్షల 82వేల దీపాల రికార్డ్‌ను బ్రేక్ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
మరింత ప్రత్యేకత..
Deepotsav In Ayodhya 2023 :అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్న వేళ.. ఈ ఏడాది ఈ దీపోత్సవ్ మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. 50 దేశాలకు చెందిన రాయబారులు, ఇతర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. దీపోత్సవ్‌కు ముందు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. దీపోత్సవం అనంతరం ప్రత్యేక లేజర్ షో ఏర్పాటు చేశారు. దీపోత్సవ కార్యక్రమం నేపథ్యంలో అయోధ్య నగరంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత..
Ayodhya Deepotsav History : 2017లో యూపీలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఏటా అయోధ్యలో ఈ దీపోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. తొలి ఏడాది 51వేల దివ్వెలను వెలిగించగా.. ఆ తర్వాత 2018లో దాదాపు 3లక్షల దీపాలను వెలిగించారు. ఆ ఏడాది దక్షిణ కొరియా ప్రథమ మహిళ కిమ్ జంగ్ సూక్ ముఖ్య అతిథిగా హాజరై.. ఆ వేడుకను వీక్షించారు.