Ayodhya Bala rama Statue Photos : అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ మహోత్సవానికి సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆలయ గర్భగుడిలో ప్రతిష్ఠించబోయే విగ్రహం గురించి చర్చ జరుగుతోంది. ఇప్పటికే కర్ణాటకలోని మైసూరుకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కిన విగ్రహాన్ని ఎంపిక చేసినా, ఆ బాలరాముడి రూపం ఎలా ఉంటుంది అన్నది ఆలయ ట్రస్ట్ వెల్లడించలేదు. దానికి సంబంధించిన ఎలాంటి చిత్రాలు ప్రచురించలేదు. అయితే ఆ విగ్రహ రూపాన్ని ఇప్పటికే ప్రముఖులకు అందించిన ఆహ్వాన పత్రికలపై ముద్రించారని'ఈటీవీ భారత్' పరిశీలనలో తేలింది. బాలుడి రూపంలో ఉన్న రాముడు, చేతిలో విల్లుతో కమలం పువ్వుపై నిల్చుని ఉన్నారు.
మొత్తం ముగ్గురు వేర్వేరు శిల్పులు మలిచిన మూడు విగ్రహాలను పరిశీలించి, యోగిరాజ్ చెక్కిన ప్రతిమను ఎంపిక చేసినట్లు ఇటీవలశ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ వెల్లడించారు. యోగిరాజ్ ఎంతో ఏకాగ్రత, భక్తిశ్రద్ధలతో దైవత్వం ఉట్టిపడేలా అద్భుతంగా విగ్రహన్ని చెక్కారని చంపత్‌రాయ్ ప్రశంసించారు. విగ్రహ తయారికీ ఆయన చేసిన త్యాగాన్ని కొనియాడారు. ఐదేళ్ల వయసున్న బాల రాముడు నిలబడి ఉన్న రూపంలో విగ్రహం ఉంటుందని తెలిపారు. రాముడి కళ్లు తామర రేకుల మాదిరిగా ఉంటాయని, ముఖం చంద్రుడిలా ప్రకాశిస్తుందన్నారు. పెదవులపై నిర్మలమైన చిరునవ్వు ఉంటుందని పొడవాటి చేతులతో విగ్రహం ఉంటుందన్నారు. బుధవారం నాడు రామ్‌లల్లా విగ్రహం ఊరేగింపుగా అయోధ్యకు చేరుకుంటుందని చంపత్ రాయ్ తెలిపారు.
6 నెలలు మౌన వ్రతం
ఎంతో నిష్ఠతో, నియమాలతో బాలరాముడి విగ్రహన్ని యోగిరాజ్ తయారుచేశారు. దాదాపు 6 నెలలు పాటు ఎవరీతో మాట్లాడకుండా బయట ప్రపంచానికి దూరంగా ఉండి ఎంతో భక్తి శ్రద్ధలతో రామ్‌లల్లా విగ్రహన్ని యోగిరాజ్ రూపొందించారు. కనీసం కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడకుండా నిష్ఠతో తయారుచేశారు. విగ్రహాన్ని తయారు చేసిన అన్నిరోజులు యోగిరాజ‌్ సెల్‌ఫోను కూడా వాడలేదని అతని కుటుంబసభ్యులు తెలిపారు. తమ కుమారుడు చేసిన ప్రతిమ ఎంపికవ్వడం పట్ల యోగిరాజ్ తల్లి అశ్వతి సంతోషం వ్యక్తం చేశారు.