Ayodhya 14 Kosi Parikrama 2023 :ఉత్తర్‌ప్రదేశ్‌లోని శ్రీరామ జన్మభూమి అయోధ్య నగర ప్రదక్షిణ (14 కోసి పరిక్రమ) కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతోంది. లక్షలాది మంది భక్తులు.. రామ నామస్మరణ చేసుకుంటూ 45 కిలోమీటర్లు నడుస్తున్నారు. మంగళవారం వేకువజామున 2.09 గంటలకు శుభముహుర్తంగా పూజారులు ఖరారు చేసినప్పటికీ.. అంతకు ముందే భక్తులు ప్రదక్షిణ ప్రారంభించారు. ఏటా కార్తిక మాస నవమి నాడు ఈ కార్యక్రమం అయోధ్యలో నిర్వహిస్తుంటారు.
50 లక్షలకుపైగా భక్తులు!
Ayodhya 14 Kosi Parikrama 2023 Date And Time :కార్తిక నవమి రోజున అనేక మంది ప్రజలు.. పూజలు, ఉపవాసాలు, దానధర్మాలు చేస్తుంటారు. నవమి రోజు అలా చేస్తే పుణ్యం లభిస్తుందని నమ్ముతారు. ఆ పుణ్యం ఎప్పటికీ పోదని విశ్వసిస్తారు. అందుకే ఏటా అయోధ్యకు ప్రదక్షిణలు చేయడానికి ప్రజలు తండోపతండాలుగా వస్తారని స్థానికులు చెబుతున్నారు. ఈ ఏడాది 50 లక్షల మందికి పైగా భక్తులు ప్రదక్షిణలు చేస్తారని అంచనా వేస్తున్నారు.
పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు.. అనేక జాగ్రత్తలు
Ayodhya 14 Kosi Parikrama Marg : అయితే అయోధ్య నగర ప్రదక్షిణ కోసం అధికారులు.. పటిష్ఠంగా భద్రతా ఏర్పాట్లు చేశారు. దాదాపు 45 కిలోమీటర్ల ప్రదక్షిణ మార్గంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. రోడ్డుపై దుమ్ము ఎగిసిపడకుండా నీరు చల్లేందుకు మనుషులను నియమించారు. ప్రజలకు తాగునీరు అందించే బాధ్యతను ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందికి అప్పగించారు. ప్రదక్షిణ మార్గంలో పలు చోట్ల వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. వీటితో పాటు స్థానిక ప్రజలు.. భక్తులకు ఆహార పదార్థాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు.