సిక్కింలో ఘోర ప్రమాదం జరిగింది. నాథులా పాస్ వద్ద భారీ మంచు చరియ విరిగిపడిన ఘటనలో.. ఏడుగురు పర్యటకులు మృతిచెందారు. మరో 12 మంది గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో.. 150 మందికిపైగా పర్యటకులు ఉన్నట్లు తెలుస్తోంది. మంగళవారం మధ్యాహ్నం 12.20 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే సహాయక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని బాధితులను కాపాడే చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు 22మందిని కాపాడినట్లు వారు చెప్పారు. సాయంత్రం 5:35 గంటల తర్వాత హిమపాతం ప్రభావం ఎక్కువైనందున సహాయ చర్యలు తాత్కాలికంగా నిలపివేసినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. గాయపడినవారిని సిక్కిం రాజధాని గ్యాంగ్‌టక్‌లోని ఆస్పత్రులకు తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే సిక్కిం ముఖ్యమంత్రి పీఎస్ గోలే గ్యాంగ్‌టక్‌లోని ఆస్పత్రికి చేరుకున్నారు.
మంగళవారం మధ్యాహ్నం తూర్పు సిక్కింలోని సంగమో సరస్సు సమీపంలో జవహర్లాల్ నెహ్రూ మార్గ్‌లోని 14వ మైలురాయి వద్ద ఒక్కసారిగా మంచుచరియలు విరిగిపడ్డాయి. దీంతో రహదారిపై ప్రయాణిస్తున్న ఓ కారు కాలువలో పడిపోగా.. వందలాది మంది పర్యటకులు ఈ హిమపాతంలో చిక్కుకున్నారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు, ఇండియన్ ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు ప్రారంభించాయి. అయితే సహాయక సిబ్బంది కాపాడిన వారిలో ఏడుగురు మృతి చెందారు. ఘటనాస్థలంలో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో సహాయక చర్యలు కొనసాగాయని.. రక్షణ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం భారీ హిమపాతం కారణంగా సహాయక చర్యలు తాత్యాలికంగా నిలుపుదల చేసిన్టుల ఆర్మీ అథికారులు వెల్లడించారు. వీరితో పాటుగా మంచుచరియల కింద చిక్కుకున్నవారిని రక్షించేందుకు స్థానికులు కూడా సహాయక చర్యల్లో భాగమయ్యారు.