పిల్లల కోసం కొవిడ్ టీకా అందుబాటులోకి వస్తే అది కీలకమైన విజయమని ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా పేర్కొన్నారు. తద్వారా పాఠశాలలను పునఃప్రారంభించటం సహా చిన్నారులు స్వేచ్ఛగా బహిరంగ కార్యాకలాపాల్లో పాల్గొనేందుకు అవకాశం లభిస్తుందని చెప్పారు. 2 నుంచి 18 ఏళ్ల లోపు వయస్సు వారి కోసం భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేస్తున్న కొవాగ్జిన్ టీకా.. రెండో, మూడో దశ క్లినికల్ ట్రయల్స్ సమాచారం సెప్టెంబర్ నాటికి వస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు గులేరియా.
"కొవిడ్ మహమ్మారి వల్ల ఏడాదిన్నరగా పిల్లలకు తమ చదువుల్లో తీరని నష్టం ఏర్పడింది. పాఠశాలలను పునఃప్రారంభించటంలో చిన్నారులకు టీకా అందించే ప్రక్రియ.. అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది. భారత్ బయోటెక్ కంటే ముందే ఫైజర్ వ్యాక్సిన్.. చిన్నారులు కోసం అందుబాటులోకి వస్తే అది సదవకాశమే. జైడస్ వ్యాక్సిన్‌కు అనుమతి లభించినా అది మరో అవకాశమే."
-డాక్టర్ రణదీప్ గులేరియా, ఎయిమ్స్ చీఫ్