కర్ణాటక బెంగళూరులో ఇటీవల బయటపడిన బెడ్ రాకెట్ సంచలనం సృష్టించింది. నగరంలో ఏర్పాటు చేసిన వార్ రూంకు చెందిన సిబ్బంది ఏజెంట్లతో కుమ్మక్కై పడకల కృత్రిమ కొరత ఏర్పడేలా చేశారని ఆరోపణలు వచ్చాాయి. ప్రభుత్వం వెంటనే వారిని తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రస్తుతం నగరంలో మూడు వేలకు పైగా పడకలు అందుబాటులోకి వచ్చాయి. ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ అయిన బీబీఎంపీలో 3,210 పడకలు ఖాళీగా ఉన్నట్లు చూపిస్తోంది. అయితే మంగళవారం అర్ధరాత్రి వరకు వీటి సంఖ్య సున్నాగా ఉండడం గమనార్హం.
సిబ్బంది తొలగింపు..
బెంగళూరు సౌత్జోన్లో కరోనాకు సంబంధించి వార్ రూంను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఇందులో కొవిడ్ రోగులకు ఎన్ని పడకలు అందుబాటులో ఉన్నాయి అనే విషయాన్ని ప్రభుత్వ అధికార వెబ్సైట్ అయిన బీబీఎంపీ ద్వారా ఎప్పటికప్పుడు తెలియచేస్తుండాలి. అయితే వార్ రూంలో పనిచేసే ఉద్యోగులు కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో 17 మంది కాంట్రాక్టు సిబ్బందిని ప్రభుత్వం తొలగించింది.