ఓ మహిళ ప్రసవం.. చాలా ఏళ్ల అనుభవం ఉన్న డాక్టర్లనే ఆశ్చర్యానికి గురి చేసింది. స్కానింగ్‌కు సైతం అంతుపట్టని విధంగా ఆ మహిళ కడుపులో శిశువులు ఉండటం గమనార్హం. ఉత్తర్‌ప్రదేశ్ ఆగ్రాలోని ఎత్మాద్దౌలా ప్రాంతంలోని ప్రకాష్ నగర్‌కు చెందిన ఆటో డ్రైవర్ మనోజ్ భార్య ఖుష్బూ గర్భవతి. ప్రసవం కోసం ట్రాన్స్ యమునా కాలనీ ఫేజ్-1లోని అంబే ఆసుపత్రిలో చేర్చాడు. ప్రసవానికి ముందు ఖుష్బూకు డాక్టర్లు అల్ట్రాసౌండ్ చేశారు. అందులో కవలలు కనిపించారు. ఈ క్రమంలో మహిళకు శస్త్రచికిత్స చేస్తున్న క్రమంలో కడుపులో నలుగురు శిశువులు కనిపించారు. దీంతో వైద్యులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఖుష్బూ జన్మనిచ్చిన నలుగురు పిల్లల్లో ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ప్రస్తుతం తల్లి, బిడ్డలు క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ఏడుకు చేరిన మొత్తం సంతానం
తాజాగా జన్మించిన నలుగురు పిల్లలతో ఆటో డ్రైవర్ మనోజ్ సంతానం మొత్తం ఏడుకు చేరడం గమనార్హం. అయితే మనోజ్‌కు అంతకు ముందే ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కుటుంబాన్ని పోషించేందుకు మనోజ్ ఆటో నడుపుతున్నాడు. ఒకేసారి నలుగురు పిల్లలు పుట్టారని కాస్త ఆందోళనకు గురయ్యారు. అయితే అందరూ క్షేమంగా ఉన్నారని తెలిసి సంతోషం వ్యక్తం చేశాడు మనోజ్.