ఆటో కాకుండా ర్యాపిడో బైక్ బుక్ చేసుకుంటానని చెప్పినందుకు ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌ను వాహనంతో ఢీ కొట్టాడు డ్రైవర్. అనంతరం ఆటోతో సహా అక్కడి నుంచి పారిపోయాడు. కర్ణాటక బెంగళూరులో జరిగిందీ ఘటన. స్థానికంగా ఉన్న సీసీటీవీలో ఘటన దృశ్యాలన్నీ రికార్డయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని పట్టుకునే పనిలో పడ్డారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం ఉదయం 3.30 గంటలకు ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్.. హెచ్ఎస్ఆర్ లేఅవుట్ సెక్టార్ వన్ ప్రాంతంలో వాహనం కోసం వేచి చూస్తున్నాడు. అదే సమయంలో అక్కడికి ఓ ఆటో వచ్చింది. దీంతో ఆటో వద్దకు వెళ్లిన సాఫ్ట్వేర్ ఇంజినీర్.. డ్రైవర్‌తో రేటు విషయంపై మాట్లాడాడు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య సరైన బేరం కుదరలేదు. దీంతో సాఫ్ట్వేర్ ఇంజినీర్.. తనకు ఆటో వద్దని.. ర్యాపిడో బైక్ బుక్ చేసుకుంటానని డ్రైవర్‌కు చెప్పి పక్కకు వచ్చాడు. దీంతో ఆగ్రహానికి గురైన ఆటో డ్రైవర్.. సాఫ్ట్వేర్ ఇంజినీర్‌ను వాహనంతో ఢీ కొట్టాడు. దీంతో సాఫ్ట్వేర్ ఇంజినీర్ కింద పడ్డాడు. వెంటనే లేచి.. ఆటోడ్రైవర్‌ను పట్టుకునేందుకు ప్రయత్నించాడు. అప్పటికే ఆటోతో పాటు అక్కడి నుంచి పారిపోయాడు డ్రైవర్. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు. ఘటనపై కేసు నమోదు పోలీసులు.. సీసీటీవీ పుటేజ్ ఆధారంగా నిందితుడిని పట్టుకునే పనిలో పడ్డారు. ఘటన దృశ్యాలన్నీ సీసీటీవీలో రికార్డయ్యాయి. కాగా బెంగళూరులో చాలా రోజులుగా ర్యాపిడో బైక్‌లపై.. ఆటో డ్రైవర్లు నిరసన తెలుపుతున్నారని పోలీసులు చెప్పారు.
భార్యను చంపిన భర్త.. తల నరికి..
పొలంలో భార్యను హత్య చేసి.. తలను ఇంటికి తీసుకువచ్చాడు ఓ భర్త. ఉదయం భార్యతో పాటే పొలానికి వెళ్లి భర్త.. అక్కడ ఆమెతో గొడవపడి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన ఒడిశాలోని గజపతి జిల్లాలో జరిగింది. కాశీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సారా గ్రామంలో నివాసం ఉండే చంద్రశేఖర్ కరి.. తన భార్య ఊర్మిళను హత్య చేశారని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని వారు వెల్లడించారు. నాలుగేళ్ల క్రితం చంద్రశేఖర్, ఊర్మిళ వివాహం చేసుకున్నారని వివరించారు.