దిల్లీలోని కంఝవాలా ఘటన తరహాలో మరో కేసు వెలుగులోకి వచ్చింది. బైక్ నడుపుతున్న ఓ వ్యక్తిని ఆటో డ్రైవర్ ఢీకొట్టి ఒక్కటిన్నర కిలోమీటర్ వరకు ఈడ్చుకెళ్లాడు. ఈ రోడ్డు ప్రమాదంలో.. కదులుతున్న ఆటో టైర్లో యువకుడి కాలు ఇరుక్కుపోయింది. బిహార్‌లోని సహర్సా జిల్లాలో ఈ ఘటన జరిగింది.
పోలీసుల కథనం ప్రకారం..
గాయపడిన వ్యక్తిని 25 ఏళ్ల కోమల్ కుమార్‌గా గుర్తించారు పోలీసులు. మంగళవారం రాత్రి కోమల్ తన మోటార్ సైకిల్‌పై ప్రయాణిస్తున్న సమయంలో అదే రోడ్డులో వెళ్తున్న ఓ ఆటో అతడి బైక్‌ను ఢీకొట్టి ఒకట్టిన్నర కిలోమీటర్ల వరకు ఈడ్చుకెళ్లిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో కోమల్ కాలు ఆటో టైర్లో ఇరుక్కుపోయిందని చెప్పారు. ఇది గమనించిన ఆటో డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా అలాగే ఒకటిన్నర కీలోమీటరు వరకు లాక్కెళ్లి నిర్మానుష్య ప్రాంతంలో వదిలి పారిపోయాడని తెలిపారు. ఈ క్రమంలో కోమల్ తీవ్రంగా గాయపడ్డాడు.
ఇది గమనించిన స్థానికులు కోమల్‌ను దగ్గర్లో ఉన్న ఆసుపత్రిలో చేర్పించారు. కాగా, ఇతడు ముంగేర్ జిల్లా నుంచి తన స్వగ్రామమైన హేంపుర్కు తన తాత దహనసంస్కారాలకు హాజరయ్యేందుకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆటో డ్రైవర్‌ను పట్టుకునేందుకు ముమ్మరంగా గాలిస్తున్నారు. 'కోమల్ పరిస్థితి చాలా విషమంగా ఉంది. తీవ్రమైన రక్తస్రావం జరిగింది' అని కోమల్ మామ చెప్పారు. ప్రమాదంలో కాలు ఆటో చక్రంలో ఇరుక్కుపోయినందున అవసరమైతే కాలు తొలిగిస్తేగానీ అతడి ప్రాణాలను కాపాడలేమని వైద్యులు తెలిపారని కోమల్ మామ చెప్పారు. ప్రస్తుతం, అతడు సర్దార్ ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డ్‌లో మృత్యువుతో పోరాడుతున్నాడని ఆయన అన్నారు.
ఇద్దరు స్నేహితుల్లో ఒకరు మృతి..
దిల్లీలో రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం రాత్రి అష్రఫ్ నవాజ్ ఖాన్(30), అంకుర్ శుక్లా(29) ఇద్దరు స్నేహితులు కలిసి భోజనం కోసం ఓ రెస్టారెంట్‌కు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో అటు నుంచి వస్తున్న ఓ కారు వారిద్దరినీ ఢీకొట్టింది. ఈ ఘటనలో గాయపడిన ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు స్థానికులు. కాగా చికిత్స పొందుతున్న నవాజ్ ఖాన్ బుధవారం మృతి చెందగా అంకుర్ పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదంలో అంకుర్ శుక్లా కాలు విరిగింది. ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించారు. అంకుర్‌ను మెరుగైన చికిత్స కోసం మ్యాక్స్ ఆస్పత్రిలో చేర్పించామని తెలిపారు. కాగా ఇద్దరూ దిల్లీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)లో పీహెచ్డీ చదువుతున్నారు. ప్రమాదానికి కారణమైన కారును ఘటనా స్థలానికి కొంతదూరంలో గుర్తించామని.. కారు డ్రైవర్‌ను త్వరలోనే అతడిని అరెస్టు చేస్తామని పోలీసులు చెప్పారు.