కరోనాతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కేరళలో నిఫా వైరస్(Nipah Virus in kerala) వ్యాప్తి కలకలం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో.. వైరస్‌తో మృతి చెందిన బాలుడికిసన్నిహతంగా మెలిగిన వారిని(Virus contacts) గుర్తించే పనిలో ఆ రాష్ట్ర ప్రభుత్వం నిమగ్నమైంది.
కాంటాక్ట్ ట్రేసింగ్‌తో పాటు వైరస్ మూలాలను కనుగొనడమే తమ ప్రధాన కర్తవ్యమని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ సోమవారం తెలిపారు. బాలుడితో సన్నిహతంగా మెలిగిన వారిలో.. 20 మందికి అత్యధిక ముప్పు పొంచి ఉండగా.. వారిలో ఏడుగురి నమూనాలను పుణెలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పరీక్ష కోసం పంపామని చెప్పారు.
"బాలుడితో సన్నిహతంగా మెలిగిన వారిని గుర్తించడం అత్యంత ప్రధానమైన అంశం. ఇందుకోసం క్షేత్రస్థాయి కార్యకర్తలకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాం. అదే సమయంలో వైరస్ మూలాలను కనుగొనడం అంతే ప్రధానమైన విషయం. మృతి చెందిన బాలుడికే వైరస్... మొదటిసారి సోకిందా లేదా అతడికి వైరస్ ఎవరి నుంచి సోకింది? అనే విషయాన్ని కనుగొనాలి. ఆదివారం 188 మందిని గుర్తించాం. అయితే.. ఈ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటుంది. మేం ప్రతి ఒక్కరినీ గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నాం."
-వీణా జార్జ్, కేరళ ఆరోగ్య శాఖ మంత్రి.
వైరస్ సోకిన తర్వాత బాలుడిని వివిధ ఆస్పత్రులకు అతని తల్లిదండ్రులు తరలించినందున.. అతడితో సన్నిహతంగా మెలిగిన వారి సంఖ్య ఎక్కువగా ఉంటుందని వీణా జార్జ్ పేర్కొన్నారు. వైరస్ వ్యాప్తికి అవకాశం ఉన్న నేపథ్యంలో మృతి చెందిన బాలుడి గ్రామమైన చాతమంగళం ప్రాంతంలో లాక్డౌన్ తరహా ఆంక్షలు విధించారు. బాలుడి ఇంటి చుట్టూ మూడు కిలోమీటర్ల పరిధిని కంటెయిన్మెంట్ జోన్‌గా ప్రకటించారు.