తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చలనం లేని శరీరం.. చెక్కుచెదరని సంకల్పం.. ఆన్​లైన్​ పాఠాలతో లాయర్ కొత్త జీవితం

రోడ్డు ప్రమాదానికి గురై శరీరంలోని 95 శాతం చలనాన్ని కోల్పోయారు ఆ లాయర్. కుమార్తెను కూడా ఆ ప్రమాదంలో పోగొట్టుకోవడం వల్ల శారీరకంగా, మానసికంగా దెబ్బతిని కుంగిపోయారు. కానీ తాను నేర్చుకున్న విద్యతో వీటి అధిగమించారు. టీచర్​గా మారి పిల్లలకు పాఠాలు చెప్తూ కొత్త జీవితం ప్రారంభించారు.

lawyer
lawyer

By

Published : Jul 20, 2022, 7:14 PM IST

Updated : Jul 20, 2022, 10:18 PM IST

ఆన్​లైన్​ పాఠాలతో లాయర్​ కొత్త జీవితం

మనోధైర్యం, విద్యను అస్త్రాలుగా చేసుకుని కష్టాల చీకట్లను తరిమికొట్టారు ఓ న్యాయవాది. సంపాదించిన జ్ఞానానికి కాస్త సంకల్పం తోడైతే ఎన్ని ఇబ్బందులనైనా అధిగమించవచ్చని నిరూపించారు. శరీరం కదలలేని స్థితిలో కుటుంబాన్ని పోషిస్తూ ఆత్మవిశ్వాసాన్ని చాటుకుంటున్నారు. వృత్తి కోసం నేర్చుకున్న విద్య, వాక్ శక్తితో ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు.

మహారాష్ట్ర ఔరంగాబాద్​లోని పిసాదేవి ప్రాంతంలో నివసిస్తున్న ఈయన పేరు ఉదయ్ చవాన్. వృత్తిరీత్యా న్యాయవాది అయిన ఈయన 2019లో ఓ ప్రమాదానికి గురై శరీరంలో 95 శాతం చలనాన్ని కోల్పోయారు. అదే ప్రమాదంలో తన కూతుర్నీ పోగొట్టుకున్నారు. కాళ్లు, చేతులు పనిచేయడం ఆగిపోయాయి. మానసికంగా, శారీరకంగా దెబ్బతిని తీవ్రంగా కుంగిపోయారు చవాన్.

ఉదయ్​ చవాన్

"2019 ఫిబ్రవరి 10న రాయగఢ్ కోటను చూసేందుకు వెళ్లి తిరిగి వస్తుండగా మాకు ప్రమాదం జరిగింది. మా వాహనం మూడుసార్లు పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో నా తల, వెన్నెముకకు తీవ్ర గాయాలయ్యాయి. ఆ తర్వాత నాకు పక్షవాతం వచ్చింది. మాట్లాడటం తప్ప.. నా శరీరంలో ఎలాంటి చలనాలు లేవు."

-ఉదయ్ చవాన్, న్యాయవాది

ఈ పరిస్థితుల్లో ఎలాంటి వ్యక్తి అయినా.. కుటుంబానికి భారంగా మారతారనే అనుకుంటారు. కానీ ఉదయ్ చవాన్ అలా కాలేదు. అప్పటివరకు తనపై ఆధారపడిన కుటుంబానికి దారి చూపించాలని నిశ్చయించుకున్నారు. స్నేహితులు చేసిన ఆర్థిక సాయంతో శస్త్రచికిత్స పూర్తి చేసుకున్న ఆయన.. ఆ తర్వాత భార్యకు బట్టల దుకాణం పెట్టించారు. అయితే, కొద్దిరోజులకే కరోనా లాక్​డౌన్ అమలులోకి రావడం వల్ల.. ఆ ప్లాన్ సక్సెక్ కాలేదు. అప్పుడే ఆయనకు పిల్లలకు ట్యూషన్ చెప్పాలన్న ఆలోచన వచ్చింది. ప్రమాదానికి ముందువరకు ఉచితంగా విద్య నేర్పిన ఆయన పరిస్థితిని.. స్థానికులు సైతం అర్థం చేసుకున్నారు. డబ్బులు ఇచ్చి తమ పిల్లలను ట్యూషన్​కు పంపించారు.

"ముందు నుంచీ చిన్నపిల్లలకు ఉచితంగా స్పోకెన్ ఇంగ్లిష్ క్లాసులు చెప్పేవాడిని. అది నాకు ఉపయోగపడింది. స్థానిక పిల్లలకు ట్యూషన్ చెప్పడం ప్రారంభించా. క్రమంగా నా దగ్గరికి వచ్చే విద్యార్థుల సంఖ్య పెరిగింది. తద్వారా నాకు ఆర్థికంగా సహకారం లభించింది. ఇప్పటివరకు నా దగ్గర 26 మంది స్పోకెన్ ఇంగ్లిష్ నేర్చుకున్నారు. ప్రస్తుతం ఆన్​లైన్​లో 7-8 మంది, ఆఫ్​లైన్​లో ఆరుగురు ఇంగ్లిష్ నేర్చుకుంటున్నారు."

-ఉదయ్ చవాన్, న్యాయవాది

ఆన్​లైన్ క్లాసులు చెప్పేందుకు చవాన్​కు ఆయన భార్య నమ్రత సహకరిస్తున్నారు. క్లాసులు చెప్పేందుకు అవసరమైన పరికరాలను అందించడం, కెమెరాలను అమర్చడం వంటివి చేసి.. చవాన్​కు సాయంగా నిలుస్తున్నారు. ఆర్థికంగా మరింత నిలదొక్కుకునేందుకు నాలుగు నెలల క్రితం నమ్రత.. పానీపూరి వ్యాపారాన్ని ప్రారంభించారు. బట్టల దుకాణానికి అనుబంధంగా దీన్ని నడిపిస్తున్నారు. ఇంట్లో భర్తకు చేదోడువాదోడుగా ఉంటూ.. ఆర్థిక ఇబ్బందులను తొలగించేందుకు బయట కష్టపడుతున్నారు నమ్రత.

ఆన్​లైన్ క్లాసు చెప్తున్న చవాన్

ప్రమాదంలో శరీరం చచ్చుబడినప్పటికీ.. ప్రస్తుతం బతకడానికి కొత్త ఆశలు చిగురించాయని చవాన్ చెబుతున్నారు. తాను నేర్చుకున్న విద్య వృథా అవ్వలేదని, అదే తనకు కొత్త జీవితం ఇచ్చిందని అంటున్నారు. ఎవరికి వారు తమపై విశ్వాసం ఉంచుకుంటే విజయం తప్పక లభిస్తుందని జీవిత పాఠాలు బోధిస్తున్నారు.

ఇదీ చూడండి :'ఎన్నో ప్రశ్నలు'.. మహా రాజకీయంపై సీజేఐ అనుమానాలు

Last Updated : Jul 20, 2022, 10:18 PM IST

ABOUT THE AUTHOR

...view details