Bihar Panchayat building Sold: బిహార్‌లో ప్రభుత్వ ఆస్తులను దొంగలించి, విక్రయించడం సాధారణ ప్రక్రియలా మారిపోయింది. అక్రమంగా సంపాదించాలన్న కేటుగాళ్ల కుట్రలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. ఇటీవల 80 అడుగుల పొడవైన ఇనుప బ్రిడ్జిని మాయం కావడం... అంతకుముందు రైలు ఇంజిన్‌ను విక్రయించిన ఘటన వెలుగులోకి రావడం మరవక ముందే మరో ఉదంతం జరిగింది. ఈసారి ఓ ప్రభుత్వ భవనమే అక్రమార్కుల దురాశకు టార్గెట్ అయింది. కంచే చేనును మేసిన చందాన.. గ్రామ పెద్ద, కార్యదర్శి కలిసి పంచాయతీ భవనాన్నే అమ్మేశారు. ఏకంగా బిహార్ రెవెన్యూ మంత్రి రామ్‌సూరత్ రాయ్ సొంత నియోజకవర్గంలో ఈ ఘటన జరగడం.. అక్కడి ప్రభుత్వ పెద్దల పర్యవేక్షణ లోపానికి అద్దం పడుతోంది.
Bihar Panchayat Bhavan news:ముజఫర్‌పుర్ జిల్లాలోని ఔరాయీ బ్లాక్‌లోని పంచాయతీ భవనాన్ని ఎలాంటి ప్రభుత్వ ఉత్తర్వులు లేకుండానే విక్రయించేశారు. గ్రామపెద్ద, పంచాయతీ సెక్రెటరీ కలిసే ఈ అక్రమ పనికి పాల్పడ్డారు. వీరిద్దరూ కలిసి జేసీబీతో పంచాయతీ భవనాన్ని కూల్చేయించారని స్థానికులు చెప్పారు. ఏకంగా ఇటుకలను సైతం విక్రయించి డబ్బు పోగేసుకున్నారని తెలిపారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Muzaffarpur Panchayat sold:ఈ పంచాయతీ భవన నిర్మాణం 15ఏళ్ల క్రితం ప్రారంభమైంది. అయితే, ఇప్పటికీ ఇది పూర్తికాలేదు. కొన్ని పనులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అయినప్పటికీ అందులోనే కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఇదివరకు పంచాయతీలో నిధుల అవకతవకలకు సంబంధించి ఆరోపణలు రాగా.. ఓ ఉద్యోగి జైలుకు వెళ్లాడు. ఈ క్రమంలోనే గ్రామపెద్ద, కార్యదర్శి కలిసి పంచాయతీ భవనాన్ని పూర్తిగా కూల్చివేశారు. శిథిలాలను అమ్మేసుకున్నారు. ఎలాంటి అధికారిక ప్రక్రియ పాటించకుండా ఇలా భవనాన్ని కూల్చివేసినందుకు పైఅధికారులు కన్నెర్రజేశారు. వేలం వేయకుండా.. భవన శిథిలాలను విక్రయించడంపై వివరణ కోరారు.
అయితే, పంచాయతీ భవనంలో సౌకర్యాలు లేకపోవడం వల్లే కూల్చివేసినట్లు గ్రామపెద్ద ఉమాశంకర్ గుప్తా పేర్కొన్నారు. 'భవనం పూర్తిగా పాడైంది. కూర్చోవడానికి స్థలం సరిపడా లేదు. అధికారుల అనుమతితోనే భవనాన్ని కూల్చివేశాం. అదే ప్రదేశంలో మరో భవనం నిర్మిస్తాం. అన్ని సౌకర్యాలు ఉండేలా నిర్మాణం చేపడతాం' అని ఉమాశంకర్ వివరించారు.
మరోవైపు, అధికారులు మాత్రం ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. గ్రామపెద్ద, సెక్రెటరీపై.. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారన్న అభియోగాలతో కేసు నమోదైందని వెల్లడించారు. ఆర్థిక అవకతవకలు, సమాచారాన్ని దాచిపెట్టడం వంటి కేసులను నమోదు చేసినట్లు చెప్పారు. పంచాయతీ రాజ్ అధికారి గిరిజేశ్ నందన్.. నిందితుల నుంచి వివరణ కోరారు. 'వేలం లేదా ప్రభుత్వ ఉత్తర్వులు లేకుండా పంచాయతీ భవనాన్ని ఎలా కూల్చివేస్తారు? ఇందులో ఏదో అవకతవకలు ఉన్నాయి. పంచాయతీ సెక్రెటరీ సెలవుల్లో ఉన్నారు. భవనాన్ని కూల్చివేయడం నేరం కిందకు వస్తుంది. నిందితులను ఉపేక్షించేది లేదు' అని గిరిజేశ్ వివరించారు.