ఏదో ఒక విధంగా దేశాన్ని విభజించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ ప్రయత్నాలు ఫలించవని స్పష్టం చేశారు. దిల్లీలో నిర్వహించిన ఎన్సీసీ 75వ ఆవిర్భావ ర్యాలీలో పాల్గొన్న ప్రధాని.. ఐక్యత అనే మంత్రంతోనే భారత్.. మహోన్నత దేశంగా మారుతుందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం భారతదేశ సమయం నడుస్తోందని.. ప్రపంచమంతా మన దేశంవైపే చూస్తోందని మోదీ అన్నారు. ఇందుకు ప్రధాన కారణం దేశ యువతేనని అన్నారు. భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో యువశక్తి కీలకమని మోదీ తెలిపారు.
'ఎలాగైనా దేశాన్ని విభజించాలని ప్రయత్నాలు.. ఆ కుట్రలు సాగవు!' - నరేంద్ర మోదీ రూ 75 నాణెం విడుదల
దేశ విభజనకు జరుగుతున్న ప్రయత్నాలు ఫలించబోవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ప్రస్తుతం ప్రపంచమంతా భారత్‌వైపే చూస్తోందని అన్నారు. దేశ అభివృద్ధి ప్రయాణంలో యువశక్తి కీలకమని మోదీ పేర్కొన్నారు.
"ఎన్సీసీ 75వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటోంది. దేశం 2047లో 100 సంవత్సరాల స్వాతంత్ర్య వేడుకను జరుపుకోనుంది. భారత్ అప్పటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తుంది. ఆ సమయంలో మీరంతా ఎంతో ఎత్తులో ఉంటారు. అందువల్ల ఒక్క క్షణం కూడా కోల్పోకూడదు. ఏ అవకాశాన్నీ వదిలిపెట్టకూడదు. భారతమాతను అత్యున్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు సంకల్పం తీసుకొని ముందుకు సాగుతూనే ఉండాలి. భరతమాత బిడ్డల మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకోసం కొన్ని సమస్యలు సృష్టిస్తున్నారు. కానీ అలాంటి ప్రయత్నాలు ఎన్నటికీ దేశ ప్రజల మధ్య వైరుధ్యానికి కారణం కాబోవు."
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
రక్షణ రంగంలో భారత్ తీసుకొచ్చిన సంస్కరణల వల్ల దేశ యువత ప్రయోజం పొందుతున్నారని మోదీ తెలిపారు. ప్రస్తుతం ఆర్మీలోని మూడు విభాగాల్లో మహిళలు సేవలందిస్తున్నారని వెల్లడించారు. గడిచిన ఎనిమిదేళ్లలో పోలీసులు, పారామిలిటరీ దళాల్లో యువతుల సంఖ్య రెట్టింపు అయిందని మోదీ పేర్కొన్నారు.
ఎన్సీసీ ఏర్పడి 75ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రత్యేకంగా ముద్రించిన 75రూపాయల నాణేన్ని మోదీ విడుదల చేశారు. కరియప్ప మైదానంలో జరిగిన ఎన్సీసీ ర్యాలీలో 19దేశాలకు చెందిన 196మంది అధికారులు, క్యాడెట్లు పాల్గొన్నారు. ఏక్ భారత్, శ్రేష్ఠ్ భారత్ థీమ్‌తో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.