Rape Attempt On Minor: రాజస్థాన్‌లోని జైపుర్‌లో దారుణ ఘటన వెలుగుచూసింది. ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న ఓ ఎనిమిదేళ్ల బాలికను ఎవరూ లేని ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. దీంతో ఆమె ఒక్కసారిగా ధైర్యం తెచ్చుకుని.. నిందితుడి చేతిపై గట్టిగా కొరికి ఆ కిరాతకుడి బారి నుంచి తప్పించుకుంది. ఫిర్యాదు అందుకున్న ప్రతాప్‌నగర్ పోలీసులు.. నిందితుడ్ని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.
పోలీసులు వివరాల ప్రకారం.. శుక్రవారం బాధిత బాలిక తన ఇంటి బయట ఆడుకుంటుండగా.. ఆ ప్రాంతంలోనే నివసించే గోవర్ధన్ అనే వ్యక్తి ఆమెను మభ్యపెట్టి తనతోపాటు నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. అనంతరం ఆమెను బలవంతంగా వివస్త్రను చేసి అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. దీంతో బాలిక గట్టిగా కేకలు వేసింది. అసభ్యకరమైన పనులు చేస్తున్న నిందితుడి చేతిపై గట్టిగా కొరికింది. ఆ దెబ్బ నుంచి నిందితుడు కోలుకునేలోపు.. బాలిక అక్కడ నుంచి పారిపోయి తన ఇంటికి చేరుకుంది. జరిగినదంతా తన కుటుంబసభ్యులకు తెలియజేసింది.