Attack On Sadhus In West Bengal :బంగాల్లో సాధువులపై మూకదాడి జరిగిన ఘటన రాజకీయ ఉద్రిక్తతకు దారి తీసింది. ఘటనపై విచారం వ్యక్తం చేసిన బీజేపీ, అధికార మమతా బెనర్జీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. టీఎంసీ మద్దతుతోనే ఇలాంటి దుర్మార్గాలు జరుగుతున్నాయని ఆరోపించింది.
అసలేమైందంటే?
ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ముగ్గురు సాధువులు సంక్రాంతిని పురస్కరించుకుని బంగాల్‌లోని గంగాసాగర్ మేళాకు బయల్దేరారు. గురువారం పురులియా జిల్లాలో వాహనం ఆపి ఇద్దరు యువతులను గంగాసాగర్‌కు దారి అడిగారు. సాధువులను చూడగానే భయపడ్డ యువతులు గట్టిగా కేకలు పెట్టారు. ఇది గమనించిన స్థానికులు వారిని కిడ్నాపర్లుగా భావించి విచక్షణా రహితంగా దాడిచేశారు. పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపుచేశారు. సాధువులను పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించి కిడ్నాపర్లు కాదని నిర్ధరించారు. దాడికి పాల్పడిన 12 మందిని అరెస్టు చేశారు.
'బుజ్జగింపు రాజకీయాల వల్లే'
ఈ ఘటనపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తీవ్రంగా స్పందించారు. బుజ్జగింపు రాజకీయలే ఇలాంటి వాతావరణాన్ని సృష్టించాయని టీఎంసీ సర్కారు లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. 'బంగాల్లోనే ఇంత హిందూ వ్యతిరేకత ఎందుకు? 2020లో రామజన్మ భూమిఆలయానికి శంకుస్థాపన సమయంలో బంగాల్లో కర్ఫ్యూ లాంటి పరిస్థితి సృష్టించారు. తద్వారా హిందువులు ఆ కార్యక్రమాన్ని జరుపుకోకుండా అడ్డుకున్నారు. ఇప్పుడు సాధువులను కొట్టి హత్య చేసేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ఉంది. మమతా బెనర్జీ పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు కుప్పకూలాయి' అని అనురాగ్ ఠాకూర్ ఆరోపించారు.