లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు చెందిన ఇద్దరు వ్యక్తిగత సహాయకులపై దాడి జరిగింది. రాజస్థాన్ కోటాలోని స్పీకర్ క్యాంపు కార్యాలయం సమీపంలో.. ఆయన సహాయకులు జీవంధర్ జైన్, రాఘవేంద్ర సింగ్‌పై కొందరు దుండగులు దాడి చేశారు. గాయపడిన ఇద్దరిని పోలీసులు.. దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. నగరంలోని కిశోర్‌పురా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి.. దర్యాప్తు ప్రారంభించారు. బుధవారం అర్ధరాత్రి ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో.. శక్తి నగర్‌లోని స్పీకర్ ఓం బిర్లా క్యాంపు కార్యాలయానికి 50 మీటర్ల దూరంలో జీవంధర్ జైన్, రాఘవేంద్ర సింగ్ మాట్లాడుకుంటున్నారు. ఇంతలో ఓ బైక్ అదుపుతప్పి వారి వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ఉన్నవారితో పాటు.. జీవంధర్, రాఘవేంద్రకు గాయాలయ్యాయి. ఈ విషయమై ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. అనంతరం కొంతమందిని తీసుకొచ్చాడు బైక్‌పై ఉన్న వ్యక్తి. అనంతరం జీవంధర్, రాఘవేంద్ర మొబైల్ ఫోన్లు లాక్కుని అక్కడి నుంచి పరారయ్యారు.
సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని.. గాయపడిన ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు. స్పీకర్‌కు సంబంధిన వ్యవహారం కావడం వల్ల.. పోలీసులు అప్రమత్తమయ్యారు. బుద్ధవారం అర్ధరాత్రి ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. విచారణలో భాగంగా.. నిందితులు నడిపిన బైక్ అమీర్ ఘోసికి చెందినదిగా పోలీసులు గుర్తించారు. ఘటనా సమయంలో అతడు అక్కడ లేకపోయినా.. అమీర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అతడి మొబైల్ స్వాధీనం చేసుకున్నారు.
మార్పునకు మార్గాలు.. ఓం బిర్లా చింతన శిబిరాలు..
లోక్సభ్ స్పీకర్ ఓం బిర్లా నేతృత్వంలో.. లోక్‌సభ ఉద్యోగులకు చింతన శిబిరం పేరుతో మేధోమథన సమావేశాలను నిర్వహిస్తున్నారు. లోక్‌సభ సెక్రటేరియట్ పనితీరులో మరింత పారదర్శకత, నిష్పాక్షికతను తీసుకురావడానికి అధికారులు, సిబ్బంది కోసం ఈ సమావేశాలను ఏర్పాటు చేశారు. స్పీకర్ ఓం బిర్లా ఆలోచనలతో కార్యరూపం దాల్చిన ఈ చింతన శిబిరం సమావేశాలను.. లోక్‌సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్ సోమవారం ప్రారంభించారు. ఈ చింతన శిబిరాల ముగింపు సమావేశాలకు స్పీకర్ ఓం బిర్లా హజరవుతారని తెలిపారు. ఈ సమావేశాలలో దాదాపు 250 మంది అధికారులు పాల్గొననున్నారు.
సృజనాత్మకత.. వినూత్న ఆలోచనలను ప్రోత్సహించడం, అధికారుల మధ్య అంతరాలను తొలగించి.. స్నేహపూర్వక వాతావరణం ఏర్పాటు చేయడం, సాంకేతికతను ఉపయోగించుకోవడం, పనితీరులో మరింత పారదర్శకత, నిష్పాక్షికత తీసుకురావడం.. ఈ చింతన శిబిరాల లక్ష్యాలని లోక్‌సభ సచివాలయం ఓ ప్రకటనలో పేర్కొంది.