ఉత్తర్ప్రదేశ్.. ఝూన్సీలో దారుణం జరిగింది. ఇంటర్ చదువుతున్న ఓ విద్యార్థినిపై బ్లేడుతో దాడి చేశాడు ఓ యువకుడు. బాధితురాల్ని స్థానిక సివిల్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ముఖానికి 31 కుట్లు పడ్డాయని చెప్పారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని.. నిందితుడి కోసం గాలిస్తున్నారు.
అసలేం జరిగిందంటే:
బాధితురాలు ఝాన్సీలోని గ్వాలియర్ రోడ్ ప్రాంతంలో నివసిస్తోంది. కొన్ని రోజుల నుంచి ఇంగ్లీష్ నేర్చుకోవడం కోసం కోచింగ్ సెంటర్కు వెళ్తోంది. సోమవారం సాయంత్రం అలాగే కోచింగ్ సెంటర్కు వెళ్తుండగా.. నిందితుడు దానిష్ ఖాన్ ఆమె కోసం దారిలో అడ్డగించాడు. తన వెంట తెచ్చుకున్న బ్లేడుతో బాలిక మెడపై దాడి చేశాడు. అక్కడే ఉన్న బాలిక స్నేహితురాలు మధ్యలో వెళ్లి విద్యార్థినిని కాపాడింది. బాధితురాలు తీవ్ర రక్తస్రావంతోనే కోచింగ్ సెంటర్కు చేరుకుంది. అనంతరం టీచర్.. బాలికను ఆసుపత్రికి తరలించాడు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. గత రెండేళ్ల నుంచి బాధితురాలిని నిందితుడు వేధిస్తున్నాడు. బాలిక అతనితో మాట్లాడేందుకు ఇష్టపడకపోవడం వల్ల ఈ దారుణానికి పాల్పడ్డాడు. బాధితురాలికి తండ్రి లేడు. తల్లి, ఇద్దరు అక్కలు, అన్నయ్యతో కలిసి ఉంటోంది.
"నిందితుడు దానిష్ గత రెండేళ్లుగా నా కూతుర్ని వేధిస్తున్నాడు. కోచింగ్ సెంటర్ నుంచి నా కుమార్తె ఫోన్ నంబర్ సంపాదించాడు. వివిధ ఫోన్ నంబర్ల నుంచి కాల్స్ చేసి స్నేహితులుగా ఉందామని నా కూతురిపై ఒత్తిడి చేస్తున్నాడు. నా కూతురు కోచింగ్‌కు వెళ్లే సమయంలో ప్రతిరోజూ వెంటపడుతున్నారు. బెదిరింపులకు దిగుతున్నాడు. భయంతో మా అమ్మాయి ఏ రోజు ఈ విషయాన్ని ఇంట్లో చెప్పలేదు."
-బాధితురాలి తల్లి