భారత తీర ప్రాంతంలో వేర్వేరు చోట్ల భారీ స్థాయిలో మాదకద్రవ్యాల పట్టివేత కలకలం సృష్టిస్తోంది. అక్రమంగా భారత్‌కు తరలిస్తున్న ముఠా యత్నాలను మధ్యలోనే తీర ప్రాంత రక్షణ దళాలు భగ్నం చేశాయి. కేరళ, గుజరాత్ సముద్ర తీరంలో 250 కేజీల విలువైన హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నాయి. దీని మొత్తం విలువ రూ.1,500 కోట్ల మేర ఉంటుందని అధికారులు వెల్లడించారు.
తీరంలో డ్రగ్స్ అలజడి.. భారీగా హెరాయిన్ స్వాధీనం.. విలువ రూ.1500 కోట్లు పైనే! - undefined
07:48 October 08
తీరంలో డ్రగ్స్ అలజడి.. భారీగా హెరాయిన్ స్వాధీనం.. విలువ రూ.1500 కోట్లు పైనే!
అఫ్గానిస్థాన్ నుంచి పాకిస్థాన్ మీదుగా 200 కేజీల హెరాయిన్‌ను భారత్, శ్రీలంకకు తరలించాలని డ్రగ్స్ ముఠా యత్నించింది. గురువారం భారత నావికా దళం, నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో నిర్వహించిన ఆపరేషన్‌లో భాగంగా ఇరాన్ నౌక నుంచి డ్రగ్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రూ.1200 కోట్ల విలువైన హెరాయిన్‌ను, ఆరుగురు ఇరాన్ జాతీయులను అదుపులోకి తీసుకున్నారు. పాకిస్థాన్ నుంచి బోట్‌లో తీసుకువచ్చిన హెరాయిన్‌ను తర్వాత ఇరాన్‌కు చెందిన నౌకలోకి మార్చినట్లు అధికారులు భావిస్తున్నారు. ఆ తర్వాత దానిని శ్రీలంక నౌకలోకి మార్చేందుకు భారత్ జలాల్లో పయనిస్తుండగా.. భారత నావికా దళానికి ఈ ముఠా పట్టుబడింది. అయితే భద్రతా సిబ్బంది శ్రీలంక నౌక జాడను మాత్రం గుర్తించలేకపోయారు.
గుజరాత్ తీరంలో 50 కేజీల హెరాయిన్..
గుజరాత్ ఉగ్రవాద నిరోధక బృందం, తీర దళాలు సంయుక్త ఆపరేషన్‌లో అరేబియా సముద్ర తీరంలో పాకిస్థాన్ బోట్ నుంచి రూ.360 కోట్ల విలువైన (50 కేజీల) హెరాయిన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్న ఆరుగురు వ్యక్తుల్ని విచారణ నిమిత్తం జఖౌ పోర్టుకు తరలించారు.
50 కిలోల కొకైన్‌తో ఇటుకలు..
దక్షిణాఫ్రికా నుంచి తరలిస్తున్న 50.23 కిలోల కొకైన్‌ను ముంబయి డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కొకైన్‌ను 50 ఇటుకల రూపంలో గ్రీన్ యాపిల్స్ కంటైనర్లలో తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. వాటి విలువ రూ.502 కోట్లు ఉంటుందని చెప్పారు.