తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ATMలో సమస్య.. రూ.500 తిరిగివ్వని బ్యాంక్.. లక్ష ఫైన్ వేసిన కోర్ట్

ఖాతాదారుడికి రూ.500 తిరిగి చెల్లించని బ్యాంకుకు షాక్ ఇచ్చింది కన్జ్యూమర్ కోర్టు. బాధితుడికి రూ.1,02,700 కట్టాలని ఆదేశించింది. కర్ణాటక ధార్వాడ్​లో జరిగిందీ ఘటన.

atm money deducted but not received
ATMలో సమస్య.. రూ.500 తిరిగివ్వని బ్యాంక్.. లక్ష ఫైన్ వేసిన కోర్ట్

By

Published : Oct 16, 2022, 9:11 AM IST

ఏటీఎం నుంచి డబ్బులు రాకపోయినా, ఖాతా నుంచి డెబిట్ చేసి తిరిగి చెల్లించని బ్యాంకుకు షాక్ ఇచ్చింది వినియోగదారుల న్యాయస్థానం. రూ.500 నష్టపోయిన ఖాతాదారుడికి పరిహారంగా రూ.1,02,700 చెల్లించాలని ఆదేశించింది. కర్ణాటక ధార్వాడ్​లోని జిల్లా వినియోగదారుల కమిషన్ ఈమేరకు తీర్పు ఇచ్చింది.

నిర్లక్ష్యానికి మూల్యం..
ధార్వాడ్​కు చెందిన న్యాయవాది సిద్ధేశ్ హెబ్బిలీకి ఇండియన్ ఓవర్​సీస్​ బ్యాంక్​ సప్తాపుర్​ బ్రాంచ్​లో ఖాతా ఉంది. 2020 నవంబర్ 28న ఏటీఎం నుంచి రూ.500 విత్​డ్రా చేసేందుకు ప్రయత్నించారు. అయితే.. ఏటీఎం నుంచి డబ్బులు బయటకు రాలేదు. కానీ ఆయన ఖాతా నుంచి రూ.500 కట్ అయ్యాయి. అదే రోజు మరో ఏటీఎంకు వెళ్లి రూ.500 డ్రా చేశారు సిద్ధేశ్. అయితే.. ముందుగా కట్ అయిన రూ.500 ఆయన ఖాతాలో జమ కాలేదు.

2020 డిసెంబర్ 2న బ్యాంక్ మేనేజర్​కు ఫిర్యాదు చేశారు సిద్ధేశ్. తన రూ.500 తిరిగి వచ్చేలా చూడాలని కోరారు. అయితే.. బ్యాంకు సిబ్బంది పట్టించుకోలేదు. బ్యాంక్​పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ధార్వాడ్​లోని జిల్లా వినియోగదారుల కమిషన్​ను ఆశ్రయించారు సిద్ధేశ్. ఛైర్మన్​ ఈషప్ప భూటే, ఇతర సభ్యులు ఈ వ్యవహారంపై విచారణ జరిపారు. సిద్ధేశ్​ చెప్పినదంతా నిజమని నిర్ధరించారు.

నిబంధనల ప్రకారం.. బ్యాలెన్స్ కట్ అయినా ఏటీఎం నుంచి డబ్బులు రాకపోతే.. సంబంధిత బ్యాంకు ఆ మొత్తాన్ని ఆరు రోజుల్లోగా జమ చేయాలి. ఆలస్యమైతే ఒక్కో రోజుకు రూ.100 పరిహారం చెల్లించాలి. కానీ.. సప్తాపుర్​లోని ఇండియన్ ఓవర్​సీస్ బ్యాంక్​ మేనేజర్ ఈ నిబంధనలు పాటించలేదని, విధుల్లో నిర్లక్ష్యం వహించారని వినియోగదారుల కమిషన్ తేల్చింది. ఆయనపై చర్యలు తీసుకోవాలని బ్యాంకు యాజమాన్యాన్ని ఆదేశించింది.

"ఫిర్యాదుదారుడికి రూ.500 తిరిగి చెల్లించాలి. 677 రోజులు ఆలస్యం అయినందుకు.. రోజుకు రూ.100 చొప్పున రూ.67,700ను 2020 నవంబర్ 28 నుంచి 8శాతం వడ్డీతో కట్టాలి. సేవలు సరిగా అందించకుండా ఖాతాదారుడిని మానసికంగా ఇబ్బందికి గురి చేసినందుకు రూ.25వేలు పరిహారం ఇవ్వాలి. కోర్టు ఖర్చుల కోసం రూ.10వేలు ఇవ్వాలి. మొత్తంగా కలిపి ఫిర్యాదుదారుడికి రూ.1,02,700 నెల రోజుల్లోగా చెల్లించాలి" అని తీర్పు ఇచ్చింది జిల్లా వినియోగదారుల కమిషన్. రిజర్వు బ్యాంకు నిబంధనలు ఖాతాదారులకు స్పష్టంగా తెలిసేలా చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు కమిషన్ ఛైర్మన్. ఇందుకోసం బ్యాంకు పరిసరాల్లో ప్రాంతీయ భాషల్లో బోర్డులు పెట్టాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details