Atla Taddi 2023 Shubh Muhurat and Pooja Vidhanam: ఈ ఏడాది పండగలు జరుపుకునే విషయంలో సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. అధిక శ్రావణ మాసం కారణంగా.. రాఖీతో మొదలు ప్రతి పండుగా రెండు రోజులు వస్తోంది. ఇప్పుడు అదే బాటలో అట్లతద్ది ఉంది. ఇంతకీ ఈ పండుగను ఎప్పుడు జరుపుకోవాలి..? పూజా విధానం ఏంటి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
అట్లతద్ది నోము అనేది ఓ సంప్రదాయ పండుగ. ఈ పండుగను ఉత్తరాదిన కర్వాచౌత్గా జరుపుకుంటారు. సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం, గౌరీ దేవి ఆశీర్వాదం కోసం వివాహిత స్త్రీలు దీనిని జరుపుకుంటారు. అలాగే పెళ్లి కాని వారు మంచి భర్త రావాలని ఈ పండగ జరుపుకుంటారు. ఈ పండుగను ఆశ్వయుజ మాసంలో జరుపుకుంటారు. పౌర్ణమి తర్వాత మూడవ రోజు వస్తుంది. ఈ ఏడాది అట్లతద్ది రెండు రోజులు వచ్చింది. ఆశ్వయుజ బహుళ తదియ తిథి అక్టోబర్ 31వ తేదీ రాత్రి 9.30 గంటలకు ప్రారంభమై నవంబర్ 1వ తేదీ రాత్రి 9.19 గంటలకు ముగుస్తుంది. అటువంటి పరిస్థితిలో ఈ ఏడాది అక్టోబరు 31 మంగళవారం అట్ల తద్ది పండగను జరుపుకుంటున్నారు. ఇది ముఖ్యంగా మహిళల పండుగ.
Atlataddi: అదరహో అట్లతద్ది.. సందడి చేసిన మహిళలు
ఉయ్యాల పండుగ:ఆశ్వయుజ బహుళ తదియ రోజు వచ్చే ఈ రోజునే గోరింటాకు పండుగ, ఉయ్యాల పండుగ అనీ అంటారు. ఈ రోజున ఆడపిల్లలు, ముత్తయిదువులు గోరింటాకు పెట్టుకుంటారు. వేకువ జామునే లేచి అన్నం తింటారు. 'అట్లతద్దోయ్ ఆరట్లోయ్, ముద్ద పప్పోయ్ మూడట్లోయ్, పీటకింద పిడికెడు బియ్యం.. పిల్లల్లారా జెల్లల్లారా.. లేచి రారండోయ్..' అంటూ పాడుతూ.. ఇరుగు పొరుగు స్నేహితులందరితో కలిసి ఆటలు ఆడతారు. 11 తాంబూలాలు వేసుకుంటారు, 11 ఉయ్యాలలూగుతారు, 11 రకాల ఫలాలు తింటారు. పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం గౌరీ దేవికి, చంద్రుడికి పూజ చేసి 11 అట్లు చొప్పున నైవేద్యం పెట్టి.. మరో పది అట్లు ముత్తైదువుకు వాయనం ఇస్తారు.
సౌభాగ్యాన్నిచ్చే నోము అట్లతద్ది:త్రిలోక సంచారి అయిన నారదుని సూచన మేరకు ఆ పరమేశ్వరుడిని భర్తగా పొందేందుకు గౌరీ దేవి మొదటిసారిగా చేసిన వ్రతమే అట్లతద్ది. స్త్రీలు సౌభాగ్యం కోసం చేసుకునే వ్రతం ఇది. చంద్రారాధన వల్ల చంద్రుడి కళల్లో కొలువై ఉన్న శక్తి వ్రతం చేసిన వారికి వస్తుందని, ఆయన అనుగ్రహంతో స్త్రీ సౌభాగ్యం పెరుగుతుందని, కుటుంబంలో సుఖశాంతులు ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి.
నైవేద్యంగా అట్లు ఎందుకు? :అట్లతద్ది రోజున 11 అట్లను వేసి నైవేద్యంగా గౌరమ్మకు సమర్పిస్తారు. ఇలా చేయడానికి కారణం.. నవగ్రహాల్లోని కుజుడికి అట్లు అంటే మహా ఇష్టమట. అందుకు నైవేద్యంగా అట్లను పెట్టడం వలన కుజుడి అనుగ్రహం కలిగి వివాహం కానీ యువతికి మంచి భర్త లభిస్తాడని విశ్వాసం. అంతేకాదు పెళ్లైన దంపతుల్లో సంసారం సుఖంలో ఎటువంటి అడ్డంకులు రావని విశ్వాసం. గర్భధారణలోనూ సమస్యలు తొలగిపోతాయని విశ్వాసిస్తారు.
అట్లను మినుములు, బియ్యం కలిపి వేస్తారు.. మినుములు రాహువుకి .. బియ్యం చంద్రుడికి సంబంధించిన ధాన్యాలు. కనుక అట్లను దానం ఇవ్వడం వలన గర్భ దోషాలు తొలగుతాయని విశ్వాసం. ఈ అట్లను గౌరీ దేవికి నైవేద్యంగా సమర్పించడం వల్ల నవగ్రహాలు శాంతించి, మహిళలు సుఖ సంతోషాలతో జీవిస్తారని విశ్వాసం.
ఇస్తినమ్మా వాయనం.. పుచ్చుకుంటినమ్మా వాయనం!
అట్ల తద్ది కథ: అట్లతద్దికి సంబంధించి ఒక కథ ప్రచారంలో ఉంది. పూర్వం ఒక రాజు కుమార్తె, మంత్రి కుమార్తె, సేనాపతి కుమార్తె, పురోహితుని కుమార్తె నలుగురూ ఎంతో స్నేహంగా ఉండేవారు. అట్ల తదియ రోజు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి చంద్రుడు వచ్చిన తర్వాత పూజ చేసుకునేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ లోగా రాజుగారి కుమార్తె ఆకలితో సొమ్మసిల్లి పడిపోయింది. చెల్లెలి అవస్థ చూసి తల్లడిల్లిపోయిన రాకుమారులు అద్దంలో ఓ తెల్లని వస్తువు చూపించి చంద్రోదయం అయింది కొంచెం తినేశాక పూజ చేసుకో అని చెప్పారు. అన్నల మాటలు నమ్మిన ఆమె తినేసింది.
కొద్దికాలానికి నలుగురు స్నేహితులు పెళ్లిళ్లు చేసుకున్నారు. అందరకీ వయసుకి తగిన భర్త లభించగా..రాకుమార్తె కు మాత్రం ముసలి భర్త దొరికాడు. వ్రతం చేసినా తనకు మాత్రం ఎందుకిలా జరిగిందని ఆమె బాధపడగా.. అప్పుడు మిగిలిన వారంతా జరిగిన విషయం చెప్పారు. తప్పు తెలుసుకున్న రాజ కుమార్తె ఆ మర్నాడే అట్ల తదియ కావడంతో నియమంగా నోము నోచుకుంది. ఆ అక్షతలు భర్త మీద చల్లగానే ఆయనకు శాప విమోచనం జరిగి.. యువకుడిగా మారిపోయాడు. అందుకే కన్నె పిల్లలు ఈ వ్రతం చేస్తే ఉత్తముడైన భర్త లభిస్తాడని, వివాహితులు చేస్తే సౌభాగ్యంతో తులతూగుతారని పురాణాలు చెబుతున్నాయి.
అట్లతద్ది వెనుకున్న వెనుక శాస్త్రీయ దృక్పథం:ఉదయాన్నే లేచి స్వచ్ఛమైన వాతావరణాన్ని ఆస్వాదించడమే ఈ పండుగ వెనుకున్న ముఖ్య ఉద్దేశ్యం. ఈ కాలంలో విరివిగా లభించే ఉసిరి, గోంగూర తినడం ద్వారా కంటి సమస్యలు రాకుండా ఉంటాయి. చేతులకు పెట్టుకునే గోరింటాకు వల్ల.. శరీరంలో వేడి తగ్గుతుంది. రోజంతా ఆటపాటల వల్ల శరీరానికి వ్యాయామం, మనసుకు ఉల్లాసం లభిస్తాయి. పచ్చని చెట్ల నీడలో ఆడిపాడితే ఆరోగ్యకరమైన గాలిని శరీరానికి అందించినట్లౌతుంది. ఉపవాసం వల్ల జీర్ణక్రియ సక్రమంగా పనిచేస్తుంది. స్త్రీలకు మానసికంగా, శారీరకంగా ఉత్సాహాన్ని అందించడమే అట్లతదియ ముఖ్య ఉద్దేశంగా కొందరు భావిస్తారు.