తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'అతీక్​ హత్య వెనుక కుట్ర.. సీఎం రాజీనామాకు డిమాండ్'.. యోగి కీలక నిర్ణయం - అతీక్ ఎన్‌కౌంటర్‌పై ప్రతిపక్షాల స్పందన

గ్యాంగ్‌స్టర్లు అతీక్​ అహ్మద్‌, అతడి సోదరడు అష్రఫ్‌ అహ్మద్‌ హత్యల నేపథ్యంలో ఉత్తర్​ప్రదేశ్‌ ప్రభుత్వం వెంటనే స్పందించింది. అర్ధరాత్రి తన నివాసంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన సీఎం యోగి ఆదిత్యనాథ్‌.. ముగ్గురు సభ్యుల జ్యుడిషీయల్‌ కమిషన్‌ విచారణకు ఆదేశించారు. దౌర్జన్యాలు పెరిగిపోతే ప్రకృతే శిక్షిస్తుందని యూపీ మంత్రి వ్యాఖ్యానించారు. మరోవైపు.. పోలీసుల సమక్షంలోనే గ్యాంగ్‌స్టర్ల హత్యలపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లో నేరాలు పెరిగిపోయాయని.. యోగి పాలనలో శాంతిభద్రతలు క్షీణించాయని మండిపడ్డాయి.

atiq-ahmad-encounter-yogi-adityanath-react-on-atiq-encounter-case
అతీక్ అహ్మద్ ఎన్‌కౌంటర్

By

Published : Apr 16, 2023, 7:17 AM IST

Updated : Apr 16, 2023, 8:50 AM IST

అతీక్ అహ్మద్‌, అతని సోదరుడు అష్రఫ్‌ అహ్మద్‌ హత్య ఘటనపై.. ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. హత్యలపై ముగ్గురు సభ్యులతో జ్యుడిషీయల్‌ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై పూర్తి దర్యాప్తు జరగాలని భాజపా ఎంపీ సుబ్రత్ పాఠక్‌ పేర్కొన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు.. నేరాలు తారస్థాయికి చేరుకున్నపుడు.. ప్రకృతి నిర్ణయం తీసుకుంటుందని ఉత్తర్‌ప్రదేశ్‌ మంత్రి సురేశ్‌ కుమార్ ఖన్నా వ్యాఖ్యానించారు.

ఎప్పుడైతే దౌర్జన్యం పెరిగిపోతుందో, ఎప్పుడైతే నేరాలు శ్రుతిమించిపోతాయో అప్పుడు కొన్ని నిర్ణయాలు ఆకాశం నుంచి వస్తాయి. ఇది ప్రకృతి తీసుకున్న నిర్ణయం అని నాకు అర్థమైంది. దీనిపై ఎవరూ మాట్లాడాల్సిన అవసరం లేదు. మాకు తెలిసినంత వరకు అన్ని విషయాలు బయటికి వస్తాయి. వాటిని మేము చెబుతాము. గత కొన్నినెలలుగా మీరు టీవీల్లో చూస్తున్నారు. నిరంతరం దౌర్జన్యాలు చేసే వారిపై ప్రకృతి దాని సొంత నిర్ణయాలు తీసుకుంటుంది.
-సురేశ్‌ కుమార్ ఖన్నా, ఉత్తర్‌ప్రదేశ్‌ మంత్రి

ఈ హత్యలపై ప్రతిపక్షాలు.. తీవ్రంగా విరుచుకుపడ్డాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లో నేరాలు తారస్థాయికి చేరుకున్నాయని.. నేరస్థుల నైతిక స్థైర్యం పెరిగిందని.. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్ మండిపడ్డారు. పోలీసుల భద్రత మధ్య ఉన్నవారే కాల్పులకు హతమైతే.. ఇక సాధారణ ప్రజల భద్రత ఏంటని ప్రశ్నించారు. ఇలాంటి ఘటనలతో ప్రజల్లో భయానక వాతావరణం ఏర్పడుతోందన్న అఖిలేశ్‌.. కొందరు కావాలనే ఇలాంటి వాతావరణాన్ని సృష్టిస్తున్నారని తెలుస్తోందన్నారు.

అతీక్​ హత్య జరిగిన ప్రదేశం

సీఎం యోగి నేతృత్వంలో యూపీలో శాంతిభద్రతలు క్షీణించాయనడానికి ఈ హత్యలే నిదర్శనమని మజ్లిస్ అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ వ్యాఖ్యానించారు. ఎన్‌కౌంటర్‌లను ప్రోత్సహించేవారు ఈ ఘటనకు బాధ్యులు అని పేర్కొన్నారు. హంతకులు వేడుకలు జరుపుకునే సమాజంలో.. న్యాయ వ్యవస్థ ఉండి ఏం లాభం అని ప్రశ్నించారు. రాజకీయ లాభాల కోసం పోలీసులను ఉపయోగించుకోవడం దురదృష్టకరమని బీఎస్​పీ-ఎంపీ కున్వార్ డానిశ్‌ అలీ అన్నారు.

అతీక్​ హత్య జరిగిన ప్రదేశం

దోషులకు కోర్టులు శిక్షలు విధిస్తాయని.. ఈ హత్య యోగి సర్కార్‌కు సవాల్ విసిరిందని తెలిపారు. ఉత్తర్​ప్రదేశ్‌లో శాంతిభద్రతలు ఎలా ఉన్నాయో ఈ హత్యలే చెబుతున్నాయని కాంగ్రెస్ నేత రషీద్ అల్వీ పేర్కొన్నారు. దీని వెనక భారీ కుట్ర ఉన్నట్లు అనిపిస్తోందన్న అల్వీ.. ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు జరగాలన్నారు. ఘటనకు బాధ్యతగా యోగి ఆదిత్యనాథ్‌ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న పోలీసులు

"ఉత్తర్‌ప్రదేశ్‌లో చట్టం ఏవిధంగా ఉందో ఈ ఘటన చెబుతోంది. ఉత్తర్‌ప్రదేశ్‌ వెళ్తే తనను చంపేస్తారని అతీక్‌ పదే పదే చెప్పాడు. ఆ మాటలు ఇప్పుడు నిజమయ్యాయి. చాలా పోలీసులు వారి చుట్టూ ఉన్నారు. వారంతా మీడియా పర్యవేక్షణలో ఉన్నారు. అడుగు, అడుగున్నర దూరం నుంచి ఓ వ్యక్తి తుపాకీతో కాల్చాడు. ఇది ఎలా సాధ్యపడుతుంది. ముగ్గురు వ్యక్తులు పాత్రికేయుల పేరుతో రావడం అంత సులభం కాదు. దీనిపై విచారణ జరగాలి. న్యాయ విచారణ జరగాల్సిన అవసరం ఉంది." అని కాంగ్రెస్ నేత రషీద్ అల్వీ అన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి, శాంతిభద్రతలు ప్రశాంతంగా ఉండాలంటే యోగి ఆదిత్యనాథ్‌ రాజీనామా చేయాలని డిమాండ్​ చేశారు.

Last Updated : Apr 16, 2023, 8:50 AM IST

ABOUT THE AUTHOR

...view details