మనదేశాన్ని దాదాపు రెండు శతాబ్దాలు తెల్లదొరలు(british rule in india) పరిపాలించారు. దురాగతాలకు, అణచివేతకు పాల్పడుతూ దుష్టపాలన కొనసాగించారు. అయితే వలస పాలకులు 1857 ప్రథమస్వాతంత్ర్య సంగ్రామం(1857 revolt) నుంచి దాదాపు అన్ని తిరుగుబాట్లను అణచివేశారు. కానీ వాళ్లని ఎదిరించి వీరోచితంగా పోరాడిన గిరిజన ప్రాంతమూ ఉంది. అదే అఠారాహ్‌గఢ్.
బ్రిటిష్ పాలన వ్యతిరేక పోరాటంలో పృథ్వీరాజ్ చౌహాన్ వారసులు ముందు నిలిచారు. సంబల్ పూర్ రాజా సురేంద్ర సాయి, సోనాఖన్ జమీందార్ వీర్ నారాయణ్ సింగ్ తదితరులు. ఈ జమీందార్లలో కొందరు గోండులు ఉండగా, అనేకులు బింజ్వార్లు. సారవంతమైన భూమిగా పేరున్న అఠారాహ్‌గఢ్(Atharahagadh)లో అటవీ ఉత్పత్తులే ప్రధాన జీవనాధారం. పద్దెనిమిదో శతాబ్దపు అఠారాహ్‌గఢ్‌లో నేటి తూర్పు ఛత్తీస్‌గఢ్, పశ్చిమ ఒడిషా(independence revolt odisha) ప్రాంతాలున్నాయి.
ఎన్నో ప్రయత్నాలు..
దేశంలో రాజులు, జమీందార్లు స్వయంపాలన(zamindar ruler) కోసం పోరాడుతున్న వేళ.. 1757లో జరిగిన ప్లాసీ యుద్ధం(battle of plassey) బెంగాల్‌పై బ్రిటిష్ వారికి తిరుగులేని ఆధిపత్యాన్ని కట్టబెట్టింది. 1818 నాటికి వలసపాలకులు మనదేశంలో ఒక్క అఠారాహ్‌గఢ్ మినహా దాదాపు అన్ని భూభాగాలను తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. అఠారాహ్‌గఢ్ స్వాధీనానికి వలస పాలకులు చేయని ప్రయత్నం లేదు. సంబల్ పూర్ సింహాసనంపై(sambalpur rulers) దివంగత రాజా మహారాజ్ సాయి సతీమణి రాణిమోహన్ను కూర్చోబెట్టారు.ఈ చర్యను అఠారాహ్‌గఢ్ రాజులు, భూస్వాములు తీవ్రంగా వ్యతిరేకించారు.
ఈ కారణంతో సురేంద్రసాయి, సోదరుడు ఉదంత సింగ్, మామగారు బలరామ్ సింగ్‌లను అరెస్టు చేసి హజారీబాగ్ జైలులో ఉంచారు.
ఆగని తిరుగుబాటు
సురేంద్రసాయి, ఆయన కుటుంబ సభ్యులను అరెస్టు చేసిన తర్వాత కూడా తిరుగుబాటు కొనసాగింది. సోనాఖన్కు చెందిన బింజ్వార్ జమీందార్ నారాయణ్ సింగ్ తిరుగుబాటులో ముందున్నారు. 1856లో ఈ ప్రాంతంలో తీవ్ర కరువు కాటకాలు విరుచుకుపడ్డాయి. ఆ సమయంలో ఆయన గోదాము తాళాలు పగులగొట్టి ధాన్యాన్ని గ్రామీణ ప్రజలకు పంచిపెట్టారు. ఆ సమయంలో ఆయన్ని నిర్బంధంలోకి తీసుకుని రాయపూర్ జైల్లో ఉంచారు. కానీ కొద్ది రోజులకే జైలు అధికారుల కళ్లుగప్పి తప్పించుకున్నారు. 1857 జూలై 30 న భారత సైనికులు హజారీ బాగ్ జైలు తాళాలు బద్దలు కొట్టారు. సురేంద్రసాయి, ఆయన అనుచరులు తప్పించుకొనేందుకు మార్గం చూపారు. తప్పించుకున్న తర్వాత సురేంద్రసాయి తదితరులు సారంగఢ్ రాజు రాజా సంగ్రామ్ సింగ్ దగ్గర ఆశ్రయం పొందారు.