Atal Tunnel Record: ప్రపంచంలోనే అత్యంత పొడవైన హైవే టన్నెల్‌గా అటల్ సొరంగం(10 వేల అడుగుల ఎత్తులో) గుర్తింపు పొందింది. ఈ మేరకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ధ్రువీకరించిందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (డీజీబీఆర్) డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ చౌధరి ఈ మేరకు అవార్డును అందుకున్నారు. లేహ్-స్పితి లోయను కలుపుతూ అటల్ టన్నెల్‌ను డీజీబీఆర్ ఆధ్వర్యంలో నిర్మించారు.
అక్టోబర్ 3న ఉదయం 10గంటలకు ప్రధాని చేతుల మీదుగా ఈ అత్యాధునిక సొరంగం ప్రారంభోత్సవం కోసం హిమాచల్ ప్రదేశ్‌లోని రోహ్‌తంగ్ సిద్ధంగా ఉంది. అనేక వ్యూహాత్మక ప్రయోజనాలున్న ఈ సొరంగంతో మనాలి- లేహ్ మధ్య దూరం 46 కిలోమీటర్లు తగ్గిపోతుంది. అంతేకాదు దాదాపు 4- 5 గంటల ప్రయాణ సమయం ఆదా అవుతుంది. క్లిష్టమైన ప్రయాణాన్ని సురక్షితం చేస్తుంది. 9.02 కిలోమీటర్ల ఈ సొరంగ మార్గానికి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ పేరు పెట్టారు. అన్నిరకాల వాతావరణ పరిస్థితుల్ని తట్టుకొనేలా, 80 కిలోమీటర్ల వేగంతో వాహనాలు ప్రయాణించేలా అత్యాధునిక సాంకేతికతతో ఈ సొరంగాన్ని నిర్మించారు.