దేశభద్రతకు సంబంధించిన కీలక సమస్యలను పార్లమెంటరీ ప్యానెల్ మీటింగ్‌లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లేవనెత్తారు. చైనాతో ప్రతిష్టంభన, పాకిస్థాన్ నుంచి ఉగ్ర ముప్పు, అఫ్గాన్‌లో తాలిబన్ల దురాక్రమణపై చర్చించాలని రాహుల్ డిమాండ్ చేశారు.
'కంటోన్మెంట్ బోర్డుల పనితీరుపై సమీక్ష' అజెండాతో రక్షణ రంగంపై ఏర్పాటైన పార్లమెంట్ స్థాయీ సంఘం సమావేశమైంది. ఈ నేపథ్యంలో రాహుల్ లేవనెత్తిన అంశాలు అజెండాలో లేనందున.. వాటిపై చర్చించేందుకు కమిటీ ఛైర్మన్, భాజపా నేత జువాల్ ఓరమ్ నిరాకరించారు. అయితే, కంటోన్మెంట్ బోర్డుల కంటే ప్రస్తుత సమస్యలపై ముందుగా చర్చించాల్సిన అవసరం ఉందని రాహుల్ పేర్కొన్నారని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
"తూర్పు లద్దాఖ్‌లో చైనాతో ప్రతిష్టంభన, పాకిస్థాన్ ఉగ్రవాదుల నుంచి ముప్పు, శ్రీలంకలో పెరుగుతున్న చైనా ప్రాబల్యం, తాలిబన్లు కొత్త ప్రాంతాలను ఆక్రమించుకోవడం వంటి సమస్యలను రాహుల్ ప్రస్తావించారు. ఇవి చాలా తీవ్రమైన సమస్యలని, వీటిపై చర్చించాలని పట్టుబట్టారు. కానీ, అజెండాలో లేనందున దీనికి ఛైర్మన్ నిరాకరించారు. కమిటీ ఏడాది అజెండా నిర్ణయించినప్పుడు రాహుల్ సహా ఏ కాంగ్రెస్ నాయకుడూ భేటీకి హాజరు కాలేదని ఛైర్మన్ పేర్కొన్నారు."