దేశంలో కనీసం 15 కోట్ల మంది బాలలు, యువత విద్యా వ్యవస్థకు దూరంగా ఉన్నారని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. దాదాపు 25 కోట్ల జనాభాకు ప్రాధమిక స్థాయి అక్షరాస్యత కూడా లేదన్నారు. భారతీయ పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) గురువారం 'ఉద్యోగ కల్పన, వ్యవస్థాపకత' అంశంపై నిర్వహించిన వార్షిక సమావేశంలో ఆయన ఈమేరకు మాట్లాడారు.
"దేశంలోని అన్ని రకాల పాఠశాలల్లో నమోదైన 8-22 ఏళ్ల మధ్య వయసు విద్యార్థుల సంఖ్య సుమారు 35 కోట్లు. దేశంలో ఆ వయసున్నవారి సంఖ్య దాదాపు 50 కోట్లు. అంటే 15 కోట్ల మంది బడికి దూరంగా ఉన్నారని తెలుస్తోంది. దేశ ఆర్థిక వ్యవస్థలో ఉత్పాదక శ్రామికశక్తిని పెంచాలంటే వారందరినీ విద్యా వ్యవస్థలో భాగస్వాములను చేయాలి" అని ప్రధాన్ పేర్కొన్నారు.