Parliament Monsoon Session 2023 : 'ఎన్డీఏ వర్సెస్ ఇండియాగా' జాతీయ రాజకీయం మారిన నేపథ్యంలో గురువారం ప్రారంభమయ్యే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలపై ఆసక్తి నెలకొంది.మణిపుర్ హింస, ధరల పెరుగుదల వంటి కీలక అంశాలపై చర్చకు ప్రతిపక్షాలు పట్టుపడుతున్నాయి. తొలి రోజు నుంచే ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి.
పార్లమెంట్ సమావేశాల కోసం అన్ని ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం.. బుధవారం అఖిలపక్ష నాయకులతో సమావేశం నిర్వహించింది. ప్రతిపక్షాలు కోరిన ప్రతి అంశంపైనా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు పార్లమెంటరీ వ్యవహరాల మంత్రి ప్రహ్లాద్ జోషి. అన్ని పార్టీలతో బీఏసీ సమావేశం జరిగిందని.. ఇందులో మణిపుర్ హింసతో పాటు మరో 31 అంశాలపై ఈ సమావేశాల్లో చర్చించేందుకు నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
పార్లమెంట్ సమావేశాల ప్రారంభ రోజే.. మణిపుర్ అంశంపై వాయిదా తీర్మానం ఇస్తామని కాంగ్రెస్ తెలిపింది. వీటితో పాటు ఒడిశా బాలేశ్వర్ రైలు ప్రమాదం, రాష్ట్రాల్లో వరదలు, నిరుద్యోగం, చైనా సరిహద్దు అంశాలపై చర్చ చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేందుకు.. ప్రభుత్వం మొండి పట్టుదలను వీడి మధ్యమార్గంగా నడవాలని సూచించారు కాంగ్రెస్ నేత జైరాం రమేశ్. దిల్లీ ఆర్డినెన్స్‌పై ప్రవేశపెట్టే బిల్లును కచ్చితంగా అడ్డుకుంటామని తేల్చి చెప్పారు. ఇది రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం హక్కులను కాలరాయడమే అని విమర్శించారు. పార్లమెంటరీ వ్యవస్థలో ప్రభుత్వాలు అనుసరిస్తున్న మార్గాలను.. ప్రతిపక్షాలు ప్రశ్నిస్తూనే ఉంటాయని చెప్పారు.
"మాలో కొత్త ఉత్సాహం వచ్చింది. మాకు కొత్త పేరు దొరికింది. ఇప్పుడు మేము ప్రతిపక్షం కాదు.. ఇండియా పార్టీ. పార్లమెంట్ సమావేశం జరిగే ప్రతిరోజు ఉదయం.. రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు మల్లిఖార్జున ఖర్గే ఛాంబర్‌లో ప్రతిపక్ష పార్టీల నేతలు సమావేశం అవుతారు. ఆరోజు పార్లమెంట్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తారు."
--జైరాం రమేశ్, కాంగ్రెస్ నేత