తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కేరళలో ఓట్ల లెక్కింపు పూర్తి- 99 స్థానాల్లో ఎల్​డీఎఫ్​ విజయం - మమతా బెనర్జీ

Assembly elections results
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు

By

Published : May 2, 2021, 7:44 AM IST

Updated : May 2, 2021, 10:24 PM IST

22:03 May 02

కేరళలో ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఎల్‌డీఎఫ్‌ 99, యూడీఎఫ్‌ 41 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించాయి. భాజపా ఖాతా తెరవలేకపోయింది సరికదా.. ఉన్న ఒక్క స్థానాన్ని కూడా కోల్పోయింది. కేరళలో ఎల్‌డీఎఫ్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. 

అసోంలో భాజపా జయకేతనం

అసోంలోనూ ఓట్ల లెక్కింపు పూర్తయింది. భాజపా 75 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్​ 50 సీట్లకే పరిమితం కాగా ఇతరులు ఒకస్థానంలో గెలుపొందారు.

21:40 May 02

తమిళనాడు

తమిళనాడులో ఓట్ల లెక్కింపు ప్రక్రియ తుది దశకు చేరుకుంటోంది. డీఎంకే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్‌ ఫిగర్‌ను దాటేసింది. ఇంకా 27 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. 

మరోవైపు సినీనటుడు, మక్కల్‌నీది మయ్యం అధినేత కమల్‌ హాసన్‌ ఓటమిపాలయ్యారు. కోయంబత్తూరు నుంచి బరిలో దిగిన ఆయన భాజపా అభ్యర్థి వనతి శ్రీనివాసన్‌ చేతిలో పరాజయం పాలయ్యారు.

20:06 May 02

నందిగ్రామ్​ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు భాజపా అభ్యర్థి సువేందు అధికారి. ప్రజాసంక్షేమం కోసం నిరంతరం నిబద్ధతతో పని చేస్తానని అన్నారు. 

బంగాల్​లో నందిగ్రామ్‌లో భాజపా అభ్యర్థి సువేందు అధికారి విజయం సాధించారు. సీఎం మమతా బెనర్జీపై 1736 ఓట్ల తేడాతో ఆయన గెలుపొందారు. మొదటి రౌండ్‌ నుంచి ఇద్దరి మధ్య పోరు హోరాహోరీగా కొనసాగడం వల్ల ఉత్కంఠగా మారింది. రౌండ్‌ రౌండ్‌కీ ఆధిక్యాలు మారడంతో విజయం దోబూచులాడుతూ వచ్చింది. చివరకు స్వల్ప ఆధిక్యంతో సువేందు అధికారి విజయం సాధించారు. 

19:50 May 02

తమిళనాడు

థౌజండ్‌ లైట్స్‌ నియోజకవర్గంలో సినీనటి ఖుష్బూ ఓటమి పాలైంది. ఖుష్బూ.. భాజపా తరఫున బరిలోకి దిగారు.

19:40 May 02

దీదీకి ప్రధాని శుభాకాంక్షలు

మమతా బెనర్జీకి అభినందనలు తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ. బంగాల్​కు కేంద్రం నుంచి మద్దతు కొనసాగుతుందన్నారు. రాష్ట్ర ప్రజలు కరోనాను జయించేందుకు కేంద్రం సహకరిస్తుందని ప్రధాని పేర్కొన్నారు.  భాజపాను ఆదరించిన బంగాల్‌ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు మోదీ. రాష్ట్రంలో గతం కంటే భాజపా పుంజుకుందన్నారు. క్షేత్రస్థాయిలో పని చేసిన ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు తెలిపారు మోదీ.

కేరళ సీఎం పినరయి విజయన్​, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్​ లకు ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అన్నివిధాల కేంద్రం మద్దతు ఉంటుందన్నారు.  

19:29 May 02

విజయన్​ గెలుపు

ధర్మదామ్​లో కేరళ సీఎం పినరయి విజయన్​ విజయం సాధించారు. 

19:29 May 02

అసోంలో భాజపా విజయం

అసోంలో అధికార భాజపా విజయం సాధించింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్‌ ఫిగర్‌ను దాటేసింది. ఇంకా 6 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

19:13 May 02

విలువలు, ఆదర్శాల కోసం పోరాడుతాం

తాము ప్రజల తీర్పును స్వాగతిస్తామని కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ అన్నారు. విలువలు, ఆదర్శాల కోసం పోరాడుతూనే ఉంటామని రాహుల్​ వ్యాఖ్యానించారు.

19:09 May 02

నందిగ్రామ్​ ప్రజల తీర్పును స్వాగతిస్తా..

నందిగ్రామ్​ ప్రజల తీర్పును తాను స్వాగతిస్తానని బంగాల్​ సీఎం మమతా బెనర్జీ పేర్కొన్నారు. అయితే నందిగ్రామ్​ ఎన్నికల ఫలితాల ప్రకటనలో అవకతవకలు జరిగినట్లు సమాచారం వచ్చిందన్నారు దీదీ. దీనిపై న్యాయపోరాటం చేస్తామన్నారు. 

18:38 May 02

తమిళనాడు

కొళత్తూర్‌లో డీఎంకే అధినేత స్టాలిన్‌ విజయం సాధించారు.  

కోయంబత్తూర్‌లో కమల్‌ హాసన్‌ వెనుకంజలో ఉన్నారు.  

18:21 May 02

నందిగ్రామ్​ ఫలితం విషయంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. భాజపా అభ్యర్థి సువేందు అధికారిపై టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఓటమి పాలైనట్లు తెలుస్తోంది. అయితే... ఎన్నికల ఫలితాన్ని అధికారులు విత్​హెల్డ్​లో పెట్టారు. ఓట్లను మళ్లీ లెక్కించాలని టీఎంసీ పట్టుబడుతుండడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.  

బంగాల్​ ఎన్నికల్లో నందిగ్రామ్​ మొదటి నుంచి అందరి దృష్టిని ఆకర్షిస్తుండగా... ఓట్ల లెక్కింపు రోజు ఆ ఉత్కంఠ మరింత పెరిగింది. ప్రతి రౌండ్​కు ఆధిక్యం మారుతూ వచ్చింది. చివరకు 1200 ఓట్లతో మమత గెలిచారన్న ప్రకటన వెలువడింది. అనూహ్యంగా కొద్దిగంటలకే పరిస్థితి తారుమారైంది.  

'నందిగ్రామ్​ను పట్టించుకోవద్దు'

నందిగ్రామ్​ గురించి పట్టించుకోవద్దని పార్టీ శ్రేణులకు సూచించారు మమతా. "నందిగ్రామ్ గురించి చింతించవద్దు. నందిగ్రామ్ ప్రజలు ఎలాంటి తీర్పు ఇచ్చినా.. నేను దానిని అంగీకరిస్తాను. దాని గురించి పట్టించుకోవడం లేదు. టీఎంసీ 221 సీట్లకుపైగా గెలిచింది. భాజపా ఎన్నికల్లో ఓడిపోయింది" అని పేర్కొన్నారు. 

18:01 May 02

టీఎంసీ హ్యాట్రిక్​

బంగాల్​లో టీఎంసీ అధికారం సొంతం చేసుకొంది. ఇప్పటికే మెజార్టీ స్థానాల్లో గెలుపొందింది. మ్యాజిక్​ ఫిగర్​ను దాటేసి విజయఢంకా మోగించింది. 

17:54 May 02

స్టాలిన్​కు రాహుల్ శుభాకాంక్షలు

డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్​కు శుభాకాంక్షలు తెలిపారు కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ. ఈ క్రమంలో తమిళనాడు ప్రజలు.. మార్పు కోసం ఓటు వేశారని పేర్కొన్నారు. స్టాలిన్​ నేతృత్వంలో ఆ దిశగా అడుగులు వేస్తామన్నారు. 

17:46 May 02

'ఇది ఆనందించే సమయం కాదు'

కేరళ ప్రజలు.. ఎల్​డీఎఫ్​కు అనుకూలంగా తీర్పు ఇచ్చారన్న కేరళ సీఎం పినరయి విజయన్​.. ఇది కరోనాపై పోరాటం సాగించే సమయం అని పేర్కొన్నారు. "ఎల్​డీఎఫ్​కు అనుకూలంగా ప్రజలు తీర్పు ఇచ్చారు. అయితే కరోనా వ్యాప్తి వేళ.. ఇది ఆనందించే సమయం కాదు. కొవిడ్​కు వ్యతిరేకంగా పోరాటం కొనసాగించే సమయం" అని పేర్కొన్నారు విజయన్​.

17:24 May 02

కేరళలో భాజపా 'జీరో'

కేరళలో మళ్లీ వామపక్ష కూటమే అధికారం సొంతం చేసుకొంది. ఇప్పటికే మెజార్టీ స్థానాల్లో గెలుపొందింది. కేరళలో 40 ఏళ్ల తర్వాత వరుసగా రెండోసారి ఎల్​డీఎఫ్​ అధికారం చేపట్టనుంది. 

క్రితం సారి ఒక్కచోట గెలిచిన భాజపా.. ఈసారి దాన్నీ కోల్పోయింది. 

  • పాలక్కడ్‌లో భాజపా అభ్యర్థి మెట్రో శ్రీధరన్‌ ఓటమి
  • రాష్ట్ర భాజపా అధ్యక్షుడు కె.సురేంద్రన్ ఓటమి
  • పోటీ చేసిన 2 చోట్ల ఓడిన భాజపా అధ్యక్షుడు
  • కొన్ని, మంజేశ్వర్ స్థానాల్లో కె.సురేంద్రన్ ఓటమి

17:15 May 02

'అందరికీ కృతజ్ఞతలు- అంతా ఇళ్లకు వెళ్లండి'

బంగాల్​ ఎన్నికల ఫలితాలపై సీఎం మమతా బెనర్జీ స్పందించారు. తృణమూల్‌ను ఆదరించిన బంగాల్‌ ప్రజలకు ముఖ్యమంత్రి మమతా కృతజ్ఞతలు తెలిపారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ విజయం సాధించడం పట్ల ఆమె ఆనందం వ్యక్తం చేశారు. తమకు విజయం ముఖ్యం కాదని, కరోనాను ఎదుర్కోవడమే ప్రధానమని అన్నారు.

''నేను ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నా. విజయోత్సవ ర్యాలీలు నిర్వహించవద్దని విజ్ఞప్తి చేస్తున్నా. అందరూ తమ తమ ఇళ్లకు వెళ్లండి. నేను సాయంత్రం 6 గంటల తర్వాత మీడియాతో మాట్లాడుతా.''

        - మమతా బెనర్జీ

17:10 May 02

  • తమిళనాడు: ఎడప్పాడిలో సీఎం పళనిస్వామి విజయం
  • బంగాల్‌: టాలీగంజ్‌లో కేంద్రమంత్రి బాబుల్ సుప్రియో ఓటమి
  • బంగాల్‌: కృష్ణానగర్‌లో భాజపా అభ్యర్థి ముకుల్‌ రాయ్ గెలుపు

16:52 May 02

అధికార పార్టీలదే..

బంగాల్​, కేరళ, అసోంలో అధికార పార్టీలదే హవా కొనసాగుతోంది.

తమిళనాడులో డీఎంకే విజయం దిశగా దూసుకెళ్తోంది.

పుదుచ్చేరిలో ఫలితంపై ఇంకా స్పష్టత లేదు.

16:26 May 02

దీదీ విజయం..

బంగాల్​ నందిగ్రామ్​లో సీఎం మమతా బెనర్జీ.. చారిత్రక విజయం సాధించారు. భాజపా అభ్యర్థి సువేందు అధికారిపై దాదాపు 1200 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 

16:24 May 02

మమతకు రాజ్​నాథ్​ శుభాకాంక్షలు..

బంగాల్​ సీఎం మమతా బెనర్జీకి.. కేంద్ర మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు సుపరిపాలన అందించాలని కోరుకుంటున్నట్లు ట్వీట్​ చేశారు.

16:13 May 02

కేరళలో ఎల్​డీఎఫ్​​దే అధికారం..

కేరళలో అధికార ఎల్​డీఎఫ్​ మరోసారి విజయం సాధించింది. 140 స్థానాలకు గానూ మెజార్టీ 71 స్థానాల్లో గెలుపొందింది. ఇంకా 30 చోట్ల ఆధిక్యంలో ఉండటం విశేషం. 

  • ఐదేళ్లకోసారి అధికారం మారే సంప్రదాయానికి చెక్​ పెడుతూ సంపూర్ణ ఆధిపత్యం చెలాయించింది సీపీఎం నేతృత్వంలోని కూటమి.
  • ధర్మదాం నియోజకవర్గం నుంచి సీఎం పినరయి విజయన్​ గెలుపొందారు.
  • ఇక్కడ రెండు చోట్ల పోటీ చేసిన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్​ ఓడిపోయారు.
  • మెట్రోమ్యాన్​ శ్రీధరన్​ కూడా.. పాలక్కడ్​లో పరాజయం చెందారు.

16:08 May 02

నందిగ్రామ్​ ఉత్కంఠభరితం..

బంగాల్​లోని నందిగ్రామ్​లో సీఎం మమతా బెనర్జీ, భాజపా అభ్యర్థి సువేందు అధికారి మధ్య ఉత్కంఠభరిత పోరు నడుస్తోంది. 16 రౌండ్ల కౌంటింగ్​ పూర్తయ్యేసరికి సువేందు.. 6 ఓట్ల స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు. 

మొత్తంగా రాష్ట్రంలో తృణమూల్​ ఇప్పటికే 44 చోట్ల గెలుపొందింది. మరో 160కిపైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. భాజపా 90లోపు స్థానాలకే పరిమితమయ్యే సూచనలున్నాయి. 

16:06 May 02

మెట్రోమ్యాన్​ ఓటమి..

పాలక్కడ్‌లో భాజపా అభ్యర్థి మెట్రో శ్రీధరన్‌ ఓటమి

రెండు చోట్ల ఓడిన భాజపా అధ్యక్షుడు

కేరళ భాజపా అధ్యక్షుడు సురేంద్రన్​ పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓటమి చెందారు. కొన్ని, మంజేశ్వర్ స్థానాల్లో కె.సురేంద్రన్ పోటీ చేశారు.

15:41 May 02

పినరయి విజయన్​ గెలుపు..

కేరళ సీఎం పినరయి విజయన్​ ధర్మదాం నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 

ఉదయనిధి స్టాలిన్​ విజయం..

తమిళనాడు చెపాక్​ నియోజకవర్గం నుంచి.. డీఎంకే అధినేత స్టాలిన్​ తనయుడు, ఉదయనిధి స్టాలిన్​ గెలుపొందారు. 

15:33 May 02

మమతకు భారీ ఆధిక్యం..

  • 8 వేల ఓట్ల ఆధిక్యంలో మమతా బెనర్జీ
  • బంగాల్​ నందిగ్రాం నియోజకవర్గంలో సీఎం మమతా బెనర్జీ ఆధిక్యంలోకి వెళ్లారు. 16రౌండ్లు పూర్తయ్యే సమయానికి తన సమీప ప్రత్యర్థి, భాజపా అభ్యర్థిపై 8వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

15:28 May 02

విజయం దిశగా..

కేరళలో అధికార ఎల్​డీఎఫ్​ విజయం దిశగా దూసుకెళ్తోంది. మొత్తం 140 స్థానాల్లో ఇప్పటికే 54 చోట్ల గెలుపొందింది. మరో 48 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. 

15:09 May 02

క్రికెటర్​ మనోజ్​ తివారీ గెలుపు..

బంగాల్‌: శిబపూర్‌లో క్రికెటర్ మనోజ్ తివారీ (టీఎంసీ) గెలుపు

14:59 May 02

సురేంద్రన్​ ఓటమి..

  • కేరళ భాజపా అధ్యక్షుడు కె.సురేంద్రన్ ఓటమి
  • మంజేశ్వర్ స్థానంలో ఓటమి పాలైన కె.సురేంద్రన్

14:58 May 02

హోరాహోరీ..

  • నందిగ్రామ్‌లో మమతా బెనర్జీ, సువేందు అధికారి హోరాహోరీ
  • నందిగ్రామ్‌లో రౌండ్‌ రౌండ్‌కూ మారుతున్న ఆధిక్యం
  • 14 రౌండ్ల తర్వాత 2,331 ఓట్ల ఆధిక్యంలో సీఎం మమత

14:36 May 02

కేరళలో భాజపా '0'

కేరళలో సీపీఎం నేతృత్వంలోని ఎల్​డీఎఫ్​ స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. ఇప్పటికే 42 చోట్ల గెలిచి, మరో 57 స్థానాల్లో ముందంజలో ఉంది. కాంగ్రెస్​ నేతృత్వంలోని యూడీఎఫ్​ 9 చోట్ల గెలిచి, మరో 32 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

భాజపా నేతృత్వంలోని ఎన్​డీఏ ఒక్కచోటా ఆధిక్యంలో లేకపోవడం గమనార్హం. 

ఇక్కడ మొత్తం 140 స్థానాలుండగా.. మెజార్టీకి 71 చోట్ల నెగ్గాలి. 

14:29 May 02

సురేశ్​ గోపీ ఓటమి..

  • కేరళ హరిపాడ్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి రమేశ్‌ చెన్నితాల విజయం
  • త్రిస్సూర్‌లో భాజపా అభ్యర్థి, నటుడు సురేశ్ గోపి ఓటమి

14:24 May 02

స్టాలిన్​కు 'కేజ్రీ' శుభాకాంక్షలు..

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టమైన ఆధిక్యం సాధించిన డీఎంకే పార్టీ అధినేత ఎం.కె.స్టాలిన్‌కు దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ శుభాభినందనలు తెలిపారు. తమిళనాడు ప్రజల ఆశలు, ఆశయాలకు అనుగుణంగా అద్భుత పాలన అందించాలని ఆకాంక్షించారు.

14:17 May 02

భాజపా కార్యాలయం ముందు టీఎంసీ కార్యకర్తల కోలాహలం

బంగాల్​లో తృణమూల్​ కాంగ్రెస్​ స్పష్టమైన ఆధిక్యంలో దూసుకెళ్తోంది. 200పైచిలుకు స్థానాల్లో ముందంజలో ఉంది. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణుల్లో సందడి నెలకొంది. కోల్​కతా హేస్టింగ్స్​ ప్రాంతంలోని భాజపా కార్యాలయం ముందు పెద్దఎత్తున తృణమూల్​ కాంగ్రెస్​ మద్దతుదారులు చేరి సంబరాలు చేసుకుంటున్నారు. 

14:10 May 02

మళ్లీ వెనుకంజలో మమత..

బంగాల్​లోని కీలకమైన నందిగ్రామ్​లో ఆధిక్యం చేతులుమారుతోంది. 13 రౌండ్లు పూర్తయ్యేసరికి భాజపా అభ్యర్థి సువేందు అధికారి.. టీఎంసీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీపై 3వేలకుపైగా ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 

14:09 May 02

ఊమెన్​ చాందీ గెలుపు..

కేరళ పూతుపల్లిలో కాంగ్రెస్‌ అభ్యర్థి ఊమెన్‌ చాందీ విజయం సాధించారు. 

14:09 May 02

మమతకు అభినందనలు..

మమతా బెనర్జీకి అభినందనలు తెలిపిన ఎన్​సీపీ అధినేత శరద్‌ పవార్‌, దిల్లీ సీఎం అరవింద్​ కేజ్రీవాల్​.

  • ప్రజాసంక్షేమం కోసం మనం చేసే కృషి కొనసాగాలి: శరద్‌ పవార్‌
  • దీదీ అద్బుత పోరాటం చేశారు, బంగాల్​ ప్రజలకు శుభాకాంక్షలు: కేజ్రీవాల్​

13:25 May 02

అక్కడ అధికార పార్టీలదే హవా.. తమిళనాడులో డీఎంకే!

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది.

  • బంగాల్​లో తృణమూల్​ కాంగ్రెస్​ వరుసగా మూడోసారి అధికారం దిశగా దూసుకెళ్తోంది. ప్రస్తుతం.. 200 స్థానాలకుపైగా ఆధిక్యంలో ఉంది. భాజపా 83, వామపక్షాలు, ఇతరులు చెరో 3 చోట్ల ముందంజలో ఉన్నారు.
  • తమిళనాడులో డీఎంకే కూటమి 146, ఏడీఎంకే కూటమి 87 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ప్రభావం చూపిస్తుందనుకున్న కమల్‌హాసన్‌ పార్టీ ఎంఎన్‌ఎం ఒకే స్థానంలో ముందంజలో ఉంది.
  • కేరళలో ఎల్‌డీఎఫ్‌ 96, యూడీఎఫ్‌ 43, భాజపా ఒక స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.
  • అసోంలో భాజపా కూటమి 75, కాంగ్రెస్‌ కూటమి 49, ఇతరులు 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.
  • పుదుచ్చేరిలో ఎన్​డీఏ 11, కాంగ్రెస్‌ కూటమి 5, ఇతరులు ఒక స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

డీఎంకే, తృణమూల్​ శ్రేణుల సంబరాలు..

  • డీఎంకే స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకెళ్తుండటంతో.. చెన్నైలోని పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.
  • బంగాల్​లో తృణమూల్​ వరుసగా మూడోసారి అధికారం సాధించే దిశగా వెళ్తుండగా.. పార్టీ శ్రేణుల్లో సంతోషం నెలకొంది.

12:31 May 02

ఆధిక్యంలోకి మమతా బెనర్జీ..

నందిగ్రామ్​లో తృణమూల్​ కాంగ్రెస్​ అభ్యర్థి, సీఎం మమతా బెనర్జీ ఆధిక్యంలోకి వచ్చారు. ఆరు రౌండ్ల లెక్కింపు పూర్తయ్యేసరికి.. భాజపా అభ్యర్థి సువేందు అధికారిపై 1400కుపైగా ముందంజలో ఉన్నారు.

11:39 May 02

కాస్త పుంజుకున్న మమతా బెనర్జీ..

బంగాల్​ సీఎం మమతా బెనర్జీ కాస్త పుంజుకున్నారు. నందిగ్రామ్​లో ఐదో రౌండ్​ ముగిసేసరికి భాజపా అభ్యర్థి సువేందు అధికారి 3 వేలకుపైగా ఆధిక్యంలో ఉన్నారు. 

ఈ రౌండ్​లో సువేందు ఆధిక్యం 9 వేల నుంచి 3 వేలకు పడిపోవడం గమనార్హం.

  • టాలీగంజ్​లో భాజపా అభ్యర్థి బాబుల్​ సుప్రియో.. 20వేలకుపైగా ఓట్ల వెనుకంజలో ఉన్నారు.

11:23 May 02

కేరళలో సినీనటుడు సురేశ్​ గోపీ ముందంజ..

బంగాల్

  • నందిగ్రామ్‌లో సీఎం మమతా బెనర్జీ వెనుకంజలో ఉన్నారు. ప్రత్యర్థి, భాజపా అభ్యర్థి సువేందు అధికారి 8వేలకుపైగా ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

తమిళనాడు

  • ఎడప్పాడిలో సీఎం పళనిస్వామి ముందంజ
  • బోడినాయక్కనూర్‌లో డిప్యూటీ సీఎం పన్నీర్‌ సెల్వం ముందంజ
  • కొళత్తూరులో డీఎంకే అధినేత స్టాలిన్ ఆధిక్యం
  • కోయంబత్తూర్‌లో కమల్‌హాసన్‌ ముందంజ
  • కోవిల్‌పట్టిలో ఏఎంఎంకే నేత టీటీవీ దినకరన్ వెనుకంజ
  • థౌజండ్‌ లైట్స్‌లో భాజపా అభ్యర్థి, నటి ఖుష్బూ వెనుకంజ
  • చెపాక్‌లో డీఎంకే అభ్యర్థి ఉదయనిధి స్టాలిన్‌ ఆధిక్యం

పుదుచ్చేరి

  • యానాంలో మాజీ సీఎం రంగస్వామి ఆధిక్యం

కేరళ

  • ధర్మదాంలో సీఎం పినరయి విజయన్‌ ఆధిక్యం
  • పూతుపల్లిలో కాంగ్రెస్‌ అభ్యర్థి ఊమెన్‌ చాందీ ఆధిక్యం
  • పాలక్కడ్‌లో భాజపా అభ్యర్థి మెట్రో శ్రీధరన్‌ ఆధిక్యం
  • భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.సురేంద్రన్ ఆధిక్యం
  • త్రిస్సూర్‌లో భాజపా అభ్యర్థి, నటుడు సురేశ్ గోపీ ముందంజ

11:11 May 02

ఆధిక్యంలో మేజిక్​ ఫిగర్​ను దాటేశాయ్​..

నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంత అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల సరళిని బట్టి.. తమిళనాడులో అధికార మార్పిడి జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

  • తమిళనాట ఎగ్జిట్​ పోల్స్​ అంచనాలను నిజం చేస్తూ.. డీఎంకే కూటమి దూసుకెళ్తోంది. రాష్ట్రంలో మొత్తం 234 నియోజకవర్గాలుండగా..  ప్రస్తుతం ఈ కూటమి 130కిపైగా స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. అధికార అన్నాడీఎంకే కూటమి 100కు చేరువలో ఉంది. ఎంఎన్​ఎం ఒకచోట ఆధిక్యం కనబరుస్తోంది.

బంగాల్​, కేరళ, అసోంలో అధికార పార్టీల హవానే కొనసాగుతోంది. పుదుచ్చేరిలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. 

  • బంగాల్‌లో అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ ఆధిక్యంలో మేజిక్​ ఫిగర్‌ను దాటింది. అక్కడ మొత్తం 292 నియోజకవర్గాల ఫలితాలు వెలువడుతుండగా.. టీఎంసీ ప్రస్తుతం దాదాపు 190 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. భాజపా 94 స్థానాల్లో ముందంజలో ఉంది. వామపక్షాలు 3, ఇతరులు 3 చోట్ల లీడ్​లో ఉన్నారు.
  • కేరళలో సీపీఎం నేతృత్వంలోని అధికార ఎల్‌డీఎఫ్‌ కూటమి హవా సాగిస్తోంది. మొత్తం 140 స్థానాలకు గానూ.. ఈ కూటమి 89 చోట్ల ముందంజలో కొనసాగుతోంది. కాంగ్రెస్​ నేతృత్వంలోని యూడీఎఫ్‌ 48 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
  • అసోంలో మొత్తం 126 స్థానాలకు గానూ.. అధికార భాజపా కూటమి 81 స్థానాల్లో ముందంజలో ఉంది. కాంగ్రెస్‌ 40కిపైగా స్థానాల్లో ఆధిక్యం ప్రదర్శిస్తోంది.
  • పుదుచ్చేరిలో భాజపా కూటమి 12 చోట్ల, కాంగ్రెస్‌ కూటమి 4 చోట్ల ముందంజలో ఉంది.

11:04 May 02

మూడు స్థానాలతో ప్రారంభించాం.. 100 దాటాం!

బంగాల్​ అసెంబ్లీ ఎన్నికల లెక్కింపు జరుగుతున్న వేళ కీలక వ్యాఖ్యలు చేశారు భాజపా ప్రధాన కార్యదర్శి, బంగాల్​ నేత కైలాశ్​ విజయవర్గీయ. ఇంకా చాలా రౌండ్ల కౌంటింగ్​ ఉన్నందున ఇప్పుడే ఏం చెప్పలేమని అన్నారు. మేజిక్​ ఫిగర్​ను దాటుతామని ధీమా వ్యక్తం చేశారు.

''ఇంకా చాలా రౌండ్ల లెక్కింపు ఉంది.. కాబట్టి ఇప్పుడే ఏం చెప్పలేం. సాయంత్రానికల్లా స్పష్టమైన ఫలితాలు వస్తాయి. మేం మూడుతో ప్రారంభించాం. మేం 100 స్థానాలు గెలవమని కొందరు సవాల్​ చేశారు. మేం ఆ సంఖ్యను దాటాం. మేం మేజిక్​ నెంబరును కూడా దాటుతాం.''

        - కైలాశ్​ విజయవర్గీయ, భాజపా ప్రధాన కార్యదర్శి

10:59 May 02

ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు..

  • బంగాల్‌లో అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ ఆధిక్యం
  • తమిళనాడులో ఆధిక్యంలో డీఎంకే కూటమి
  • కేరళలో అధికార వామపక్షాల కూటమి ఆధిక్యం
  • అసోంలో అధికార భాజపా ఆధిక్యం
  • పుదుచ్చేరిలో భాజపా కూటమి ఆధిక్యం

10:33 May 02

మేజిక్​ ఫిగర్​ దాటిన డీఎంకే కూటమి..

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమి భారీ ఆధిక్యంలో కొనసాగుతోంది. తమిళనాడులో మొత్తం స్థానాలు 234. అధికారం చేపట్టడానికి అవసరమైన మేజిక్​ ఫిగర్‌ 117 స్థానాలను దాటేసింది డీఎంకే.

ప్రస్తుతం డీఎంకే కూటమి 130, అన్నాడీఎంకే కూటమి 90 స్థానాలకుపైగా లీడింగ్​లో ఉన్నాయి. 

ఆయా స్థానాల్లో..

ఎడప్పాడిలో సీఎం పళనిస్వామి, బోడినాయక్కనూర్‌లో డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం, కొళత్తూరులో డీఎంకే అధినేత స్టాలిన్‌, కోయంబత్తూర్‌ సౌత్‌లో కమల్‌హాసన్‌, చెపాక్‌లో డీఎంకే అభ్యర్థి ఉదయనిధి స్టాలిన్‌ ఆధిక్యంలో కొనసాగుతుండగా, కోవిల్‌పట్టిలో ఏఎంఎంకే నేత టీటీవీ దినకరన్‌, థౌజండ్‌ లైట్స్‌లో భాజపా అభ్యర్థి, నటి ఖుష్బూలు వెనుకంజలో ఉన్నారు.

10:31 May 02

4 రౌండ్ల కౌంటింగ్​ పూర్తి.. వెనుకంజలోనే మమత..

బంగాల్​లో తృణమూల్​ కాంగ్రెస్​ జోరు చూపిస్తోంది. టీఎంసీ 160 స్థానాలకుపైగా ఆధిక్యంలో ఉండగా.. భాజపా 100 చోట్ల ముందంజలో ఉంది.

అయితే.. నందిగ్రామ్​ అభ్యర్థి, సీఎం మమతా బెనర్జీ పోరాడుతున్నారు. నాలుగు రౌండ్ల కౌంటింగ్​ పూర్తయ్యే సరికి.. సువేందు అధికారి.. దీదీపై 7వేలకుపైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. 

10:12 May 02

మూడో రౌండ్​ తర్వాత కూడా దీదీ వెనుకంజ..

బంగాల్​ నందిగ్రామ్​లో మమతా బెనర్జీ వెనుకంజలోనే కొనసాగుతున్నారు. మూడు రౌండ్లు ముగిసేసరికి.. భాజపా అభ్యర్థి సువేందు అధికారి 8 వేలకుపైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.  

09:56 May 02

తమిళనాడు..

  • చెపాక్‌లో డీఎంకే అభ్యర్థి ఉదయనిధి స్టాలిన్‌ ఆధిక్యం
  • థౌజండ్‌ లైట్స్‌లో భాజపా అభ్యర్థి, నటి ఖుష్బూ వెనుకంజ

పుదుచ్చేరి..

  • యానాంలో మాజీ సీఎం రంగస్వామి ఆధిక్యం

కేరళ..

  • కేరళలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.సురేంద్రన్ ఆధిక్యం

బంగాల్​..

  • టాలీగంజ్‌లో కేంద్రమంత్రి బాబుల్ సుప్రియో వెనుకంజ

అసోం..

  • అసోం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ ముందంజ

09:48 May 02

తృణమూల్​ జోరు- వెనుకంజలో మమత..

రెండో రౌండ్​ ముగిసేసరికి బంగాల్​ నందిగ్రామ్​లో సీఎం మమతా బెనర్జీ వెనుకంజలోనే ఉన్నారు. ఆమె ప్రత్యర్థి, భాజపా అభ్యర్థి సువేందు అధికారి 4 వేలకుపైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. 

రాష్ట్రంలో తృణమూల్​ కాంగ్రెస్​ ఆధిక్యం కనబరుస్తున్నప్పటికీ.. సీఎం అభ్యర్థి వెనుకంజలో ఉండటం గమనార్హం. ఒకవేళ పార్టీ గెలిచి.. దీదీ ఓడితే పరిస్థితి ఏంటోనని టీఎంసీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది.  

09:45 May 02

ఎల్​డీఎఫ్​దే హవా..

  • కేరళలో అధికార సీపీఎం నేతృత్వంలోని ఎల్​డీఎఫ్ కూటమి జోరు చూపిస్తోంది. ​ఎల్​డీఎఫ్​ 80, యూడీఎఫ్​ 50కిపైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
  • ఇక్కడ 140 స్థానాల్లో మెజార్టీకి 71 స్థానాలు అవసరం.
  • కేరళ పాలక్కడ్‌లో భాజపా అభ్యర్థి మెట్రో శ్రీధరన్‌ ఆధిక్యం
  • ధర్మదాంలో సీఎం పినరయి విజయన్‌ ఆధిక్యం
  • పుత్తుపల్లిలో కాంగ్రెస్‌ అభ్యర్థి ఊమెన్‌ చాందీ ఆధిక్యం

09:38 May 02

కౌంటింగ్​ కేంద్రానికి స్టాలిన్​ తనయుడు..

తమిళనాడులో డీఎంకే అధినేత స్టాలిన్​ తనయుడు.. ఉదయనిధి స్టాలిన్ ఓట్ల లెక్కింపు జరుగుతున్న​ చెన్నైలోని క్వీన్​ మేరీ కాలేజీకి చేరుకున్నారు. ఆయన చెపాక్​ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు.

  • తమిళనాడులో.. అన్నాడీఎంకే సీఎం అభ్యర్థి పళనిస్వామి ఎడప్పాడిలో, డిప్యూటీ సీఎం పన్నీర్​ సెల్వం బోడినాయక్కనూర్‌లో ముందంజలో ఉన్నారు.
  • ఎంఎన్​ఎం అధినేత కమల్​హాసన్​ స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
  • కోవిల్‌పట్టిలో ఏఎంఎంకే నేత టీటీవీ దినకరన్ వెనుకంజలో ఉన్నారు.

తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలుండగా.. మెజార్టీకి 118 చోట్ల గెలవాలి.

ప్రస్తుతం డీఎంకే కూటమి 100 చోట్లకుపైగా ముందంజలో ఉంది. అన్నాడీఎంకే కూటమి పెద్దగా ప్రభావం చూపలేకపోతోంది. 

09:33 May 02

100కుపైగా స్థానాల్లో తృణమూల్​ ఆధిక్యం..

బంగాల్​లో 100కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది తృణమూల్​ కాంగ్రెస్​. భాజపా, టీఎంసీ మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. అయితే.. నందిగ్రామ్​లో సీఎం మమతా బెనర్జీ వెనుకంజలో ఉన్నారు. 

భాజపా 80కి పైగా స్థానాల్లో ముందంజలో ఉంది. మొత్తం 294 స్థానాలున్న బంగాల్​లో.. ప్రభుత్వ ఏర్పాటుకు 148 చోట్ల గెలవాల్సి ఉంటుంది.

09:10 May 02

బంగాల్​..

  • బంగాల్​ నందిగ్రామ్​లో పోటీపడిన సీఎం మమతా బెనర్జీ వెనుకంజలో ఉన్నారు.
  • శిబపూర్‌లో క్రికెటర్ మనోజ్ తివారీ(టీఎంసీ) వెనుకంజ

తమిళనాడు

  • తమిళనాడు: కొళత్తూరులో డీఎంకే అధినేత స్టాలిన్ ఆధిక్యం
  • తమిళనాడు ఎడప్పాడిలో సీఎం పళనిస్వామి ముందంజ
  • తమిళనాడు బోడినాయక్కనూర్‌లో డిప్యూటీ సీఎం పన్నీర్‌ సెల్వం ముందంజ
  • తమిళనాడు కోవిల్‌పట్టిలో ఏఎంఎంకే నేత టీటీవీ దినకరన్ వెనుకంజ
  • తమిళనాడు కోయంబత్తూర్‌లో స్వల్ప ఆధిక్యంలో కమల్‌హాసన్‌

కేరళ

  • కేరళ పాలక్కడ్‌లో భాజపా అభ్యర్థి మెట్రో శ్రీధరన్‌ ఆధిక్యం
  • ధర్మదాంలో సీఎం పినరయి విజయన్‌ ఆధిక్యం
  • పుత్తుపల్లిలో కాంగ్రెస్‌ అభ్యర్థి ఊమెన్‌ చాందీ ఆధిక్యం

09:09 May 02

బంగాల్​లో తృణమూల్​, తమిళనాడులో డీఎంకే ముందంజ..

  • బంగాల్‌ ఫలితాల్లో ఆధిక్యంలో తృణమూల్ కాంగ్రెస్‌
  • తమిళనాడు ఫలితాల్లో ఆధిక్యంలో డీఎంకే కూటమి
  • కేరళ ఫలితాల్లో ఆధిక్యంలో ఎల్డీఎఫ్‌
  • అసోం ఫలితాల్లో ఆధిక్యంలో భాజపా

08:53 May 02

సొమ్మసిల్లిన కాంగ్రెస్​ ఏజెంట్​..

బంగాల్​లోని ఉత్తర పరగణాల జిల్లా పనిహటి కౌంటింగ్​ కేంద్రంలో .. కాంగ్రెస్​ అభ్యర్థి కౌంటింగ్​ ఏజెంట్​ గోపాల్​ సోమ్ అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ఆయనను సమీప ఆస్పత్రికి తరలించారు. ​

08:48 May 02

నందిగ్రామ్​లో కౌంటింగ్​..

బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, భాజపా నేత సువేందు అధికారి పోటీపడిన నందిగ్రామ్​లో కౌంటింగ్​ ప్రారంభమైంది. 

08:38 May 02

బంగాల్​లో హోరాహోరీ..

బంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్, భాజపా మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. మొత్తం 294 స్థానాలకు గానూ 292 చోట్ల ఎన్నికలు జరిగాయి. తృణమూల్​ కాంగ్రెస్​ స్వల్పఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తోంది. లెఫ్ట్​ కూటమి పెద్దగా ప్రభావం చూపించట్లేదు. 

08:01 May 02

ఊమెన్​ చాందీ ప్రార్థనలు..

కేరళ కాంగ్రెస్​ సీనియర్​ నేత, మాజీ సీఎం ఊమెన్​ చాందీ.. పూతుపల్లి చర్చిలో ప్రార్థనలు చేశారు. ఆయన.. పూతుపల్లి నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేశారు. 

07:58 May 02

కౌంటింగ్​ షురూ..

నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్రపాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. కట్టుదిట్టమైన భద్రత నడుమ.. కౌంటింగ్​ జరుగుతోంది. గెలుపుపై ఆయా ప్రధాన పార్టీలు ధీమాగా ఉన్నాయి. సాయంత్రం కల్లా తుది ఫలితాలు వచ్చే అవకాశముంది. 

07:56 May 02

మరికాసేపట్లో కౌంటింగ్​ ప్రారంభం కానున్న నేపథ్యంలో.. తిరువనంతపురంలోని మార్​ ఇవానియోస్​ కాలేజీ వద్ద పోస్టల్​ బ్యాలెట్లు భద్రపరిచిన స్ట్రాంగ్​ రూంలను తెరిచారు. 

07:54 May 02

కేరళలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వేళ.. ఈసీ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్​ ప్రారంభం కానుంది. 

07:45 May 02

నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంత అసెంబ్లీ ఎన్నికల తుది ఘట్టానికి సర్వం సిద్ధమైంది. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుండగా.. సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గంటల వ్యవధిలోనే ఫలితాల సరళి తెలిసే అవకాశం ఉంది. ఎగ్జిట్​ పోల్స్​ అంచనాలు ఏ మేరకు నిజమవ్వనున్నాయి? ఆయా రాష్ట్రాల్లో అధికారాన్ని కైవసం చేసుకునేది ఎవరు? అనే విషయాలు నేడు తేలిపోనున్నాయి.

మొత్తం 824 అసెంబ్లీ స్థానాలకుగాను 2.7 లక్షల పోలింగ్​ కేంద్రాల్లో జరిగిన ఈ ఎన్నికల్లో.. 18.68 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

తమిళ పోరు..

తమిళనాట డీఎంకే, ఏఐడీఎంకే కూటమి మధ్య ద్విముఖపోరు నడిచింది. మళ్లీ తామే అధికారాన్ని చేపడతామని ఏఐఏడీఎంకే ధీమాగా ఉండగా.. మరోవైపు.. ఈసారి తమిళ ఓటర్లు తమకే పట్టం కడతారని డీఎంకే విశ్వాసం వ్యక్తం చేస్తోంది. అదే సమయంలో కమలహాసన్​, దినకరన్​ వంటి వారు ఏ మేరకు ప్రభావం చూపుతారన్నది సర్వత్రా ఆసక్తికరంగా మారింది.

ఇదీ చదవండి:తమిళ పోరు: కౌంటింగ్​కు వేళాయెరా

234 సీట్లకు ఏప్రిల్​ 6న ఒకే విడతలో పోలింగ్​ జరిగింది. ఈ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారం చేపట్టాలన్నా 118 స్థానాల్లో గెలవాల్సి ఉంటుంది.

తమిళనాడులో డీఎంకే ప్రభంజనం సృష్టించనుందని దాదాపు అన్ని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేశాయి. స్టాలిన్‌ నేతృత్వంలోని డీఎంకే.. అధికార పీఠాన్ని అధిరోహించనుందని వెల్లడించాయి.

బంగాల్ దంగల్​​..

294 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను సుదీర్ఘంగా ఎనిమిది విడతల్లో సాగిన బంగాల్​ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం ఎవరిని వరిస్తుందనేది.. సర్వత్రా ఆసక్తిగా మారింది. అధికార టీఎంసీ- విపక్ష భాజపా మధ్య జరిగిన హోరాహోరీ పోరుకు యావత్​ దేశం సాక్ష్యంగా నిలిచింది.

ఇదీ చదవండి:బంగాల్​ దంగల్​లో విజేత ఎవరు?

బంగాల్​లో ఏ పార్టీ అయినా.. అధికారాన్ని చేపట్టేందుకు 148 స్థానాల్లో విజయం సాధించాల్సి ఉంటుంది.

బంగాల్​ గడ్డపై టీఎంసీ మూడోసారి అధికారం.. నిలబెట్టుకుంటుందని ఎగ్జిట్‌పోల్స్‌ అంచనా వేశాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

కేరళ సమరం..

కేరళలో ఎల్​డీఎఫ్, ​యూడీఎఫ్​ హోరాహోరీ పోరులో అంతిమవిజయం ఎవరిదనేది ఆదివారం తేలనుండగా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గెలుపుపై ఈ రెండు కూటములు​ ధీమాగా ఉన్నాయి.

ఇదీ చదవండి:కేరళ సమరం- కౌంటింగ్​కు సర్వం సిద్ధం

మొత్తం 140 అసెంబ్లీ ఎన్నికలకు ఒక విడతలో పోలింగ్​ జరగ్గా.. 957మంది ఎన్నికల బరిలో నిలిచారు.

కేరళలో మరోమారు పినరయి విజయన్‌ నేతృత్వంలోని ఎల్​డీఎఫ్​ కూటమే.. అధికారాన్ని హస్తగతం చేసుకోనున్నట్లు విడుదలైన అన్ని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేశాయి.

అసోం పోరు..

​భాజపా-ఏజీపీ, కాంగ్రెస్‌ మహాకూటమి, అసోం జాతీయ పరిషత్‌ మధ్య ప్రధానంగా పోటీ సాగిన ఈశాన్య రాష్ట్రం అసోం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆదివారం తేలనున్నాయి.

ఇదీ చదవండి:అసోంలో అధికార పీఠం దక్కేదెవరికి?

126 స్థానాలున్న అసోం శాసనసభకు మూడు విడతల్లో.. మార్చి 27, ఏప్రిల్‌ 1, 6 తేదీల్లో పోలింగ్‌ జరిగింది. ఇక్కడ ఏ పార్టీ అధికారం చేపట్టాలన్నా 64 స్థానాలు సాధించాల్సి ఉంటుంది.

అసోంలో.. భారతీయ జనతా పార్టీ రెండోసారి అధికారం చేపడుతుందని ఎగ్జిట్​పోల్​ ఫలితాలు విడుదల చేసిన సర్వే సంస్థలు ప్రకటించాయి. అయితే.. అధికార కూటమికి ఈసారి గతం కంటే కొన్ని స్థానాలు తగ్గనున్నట్లు వెల్లడించాయి.

పుదుచ్చేరి పోరు..

కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో.. మొత్తం 30 స్థానాలకు ఒకే విడతలో ఏప్రిల్ 6న పోలింగ్ జరిగింది. ఇక్కడ ఏ పార్టీ అధికారాన్ని చేపట్టాలన్నా.. 16 స్థానాలు సాధించాల్సి ఉంటుంది.

ఇదీ చదవండి:పుదుచ్చేరి పోరు: తుది ఘట్టానికి సర్వం సిద్ధం

పుదుచ్చేరిలో ఎన్​డీఏ అధికారం చేపట్టే అవకాశం ఉందని దాదాపు అన్ని ఎగ్జిట్‌పోల్స్‌ అంచనా వేశాయి. అన్నాడీఎంకే, భాజపా, రంగస్వామి కాంగ్రెస్‌ పార్టీలు ఇక్కడ కూటమిగా ఏర్పడి పోటీ చేశాయి.

07:24 May 02

లైవ్ ​: 4 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతంలో కౌంటింగ్​ షురూ

దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో జరిగిన ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ఆయా రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. ఉదయం 8 గంటలకు లెక్కింపు చేపట్టనుండగా గంటల్లోనే గెలుపోటముల సరళి తెలిసే అవకాశాలున్నాయి. అసోం, కేరళల్లో ప్రస్తుత కూటములే అధికారం నిలబెట్టుకునే అవకాశాలున్నాయన్న ఎగ్జిట్‌పోల్స్‌.. తమిళనాడు, పుదుచ్చేరిలో మార్పు తప్పకపోవచ్చని అంచనా వేశాయి. హోరాహోరీ పోరు జరిగిందని భావిస్తున్న బంగాల్‌పైనే అందరి దృష్టి నెలకొంది.

ఐదు రాష్ట్రాల్లో మొత్తం 822 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ ఓట్ల లెక్కింపు జరగనుంది. కరోనా నెగెటివ్ అయితేనే లెక్కింపు కేంద్రాల్లోకి అనుమతించనున్నారు. సాయంత్రానికి తుది ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. 

ఇవీ చూడండి: బంగాల్​ దంగల్​లో విజేత ఎవరు?

కేరళ సమరం- కౌంటింగ్​కు సర్వం సిద్ధం

పుదుచ్చేరి పోరు: తుది ఘట్టానికి సర్వం సిద్ధం

అసోంలో అధికార పీఠం దక్కేదెవరికి?

మినీ సార్వత్రికంలో ఓటరు తీర్పు ఏంటి?

Last Updated : May 2, 2021, 10:24 PM IST

ABOUT THE AUTHOR

...view details