అసోంలోని మారుమూల తెగకు చెందిన జాదవ్ పాయెంగ్.. ప్రకృతిపై ప్రేమతో అడవిని సృష్టించి 'ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ద ఇండియా'గా పేరొందారు. అడవుల సంరక్షణకు ఎంతో కృషి చేసిన పాయెంగ్ పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోయింది. ఈ క్రమంలోనే మెక్సికో ప్రభుత్వం నుంచి ఆయనకు ఆహ్వానం అందింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో అక్కడికి వెళ్లనున్నారు పాయెంగ్.
అటవీ సంరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించటం, అడవుల శాతాన్ని పెంచేందుకు నడుంబిగించిన మెక్సికో.. జాదవ్ పాయెంగ్ సేవలను వినియోగించుకోవాలని నిర్ణయించింది. తమ దేశంలో 8 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో మొక్కలు నాటేందుకు పాయెంగ్‌తో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కార్యక్రమంలో వేలాది మంది విద్యార్థులు జాదవ్‌తో కలిసి పాలుపంచుకోనున్నారు.
" 10 ఏళ్లలో 8 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో మొక్కలు నాటాలని మెక్సికోలోని ఓ ఎన్జీఓ నాతో ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందం ప్రకారం పదేళ్ల పాటు ప్రతి సంవత్సరం 3 నెలలు మెక్సికోలో ఉండనున్నాను."