తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఈ శ్మశానవాటిక.. సామాజిక ఐకమత్యానికి ప్రతీక

ఏ ఊరికైనా గ్రామం అవతల శ్మశానవాటిక ఉంటుంది. కాకపోతే వివిధ మతాల వారు తమతమ ఆచారాల ప్రకారం వేర్వేరు శ్మశానాల్లో అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఒక మతం వారి అంతిమ సంస్కారాల్లో మరో మతం వారు జోక్యం చేసుకోవడం చాలా అరుదు. కానీ అసోంలోని ఓ ఊరిలో ఇలాంటి అరుదైన సంఘటనలే కనిపిస్తాయి.

CREMATION
ఈ స్మశానవాటిక.. సామాజిక ఐకమత్యానికి ప్రతీక

By

Published : Jan 1, 2021, 8:08 PM IST

ఈ శ్మశానవాటిక.. సామాజిక ఐకమత్యానికి ప్రతీక

అసోం జోర్హట్‌ జిల్లాలోని ఓ శ్మశాన వాటిక.. సామాజిక ఐకమత్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. హిందూ, ముస్లిం, క్రిస్టియన్‌ మతాలకు చెందిన వారి మృతదేహాలకు ఇక్కడే అంత్యక్రియలు నిర్వహిస్తారు. హిందువులు తమ సంప్రదాయం ప్రకారం దహన సంస్కారాలు నిర్వహిస్తే.. ముస్లింలు, క్రిస్టియన్లు తమ తమ ఆచారాల ప్రకారం మృతదేహాలు ఖననం చేస్తారు.

దేశంలో నిత్యం ఎక్కడో ఓ చోట మత ఘర్షణలు చెలరేగుతున్న ప్రస్తుత కాలంలో.. టీటీబార్‌లోని గోరాజన్‌లో ఉన్న ఈ శ్మశాన వాటిక మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది. గోరాజన్‌లో నివసించే అన్ని మతాల ప్రజలు కొన్ని దశాబ్దాలుగా ఈ పద్ధతినే అనుసరిస్తున్నారు. అయినా ఇప్పటివరకూ తమ మధ్య ఎలాంటి అభిప్రాయభేదాలు రాలేదని చెప్తున్నారు. జోర్‌హట్‌ నగరానికి 44 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ శ్మశానవాటికలోనే 90 ఏళ్లుగా అన్ని మతాలవారు తమ వారి అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.

"ఇది మా ఊరి శ్మశానవాటిక. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మతాలకు చెందిన వారు తమవారి మృతదేహాలకు ఇక్కడే అంత్యక్రియలు చేస్తారు. శ్మశానవాటిక లోపల చిన్న కాలువ ఉంటుంది అంతే. ఇంకే అవరోధాలూ లేవు. ఇక్కడే అన్ని మతాల వారి అంతిమ సంస్కారాలు జరిగేది."

-ఇమ్రాన్ హుస్సేన్, స్థానికుడు

మూడు మతాలకు చెందినవారు.. తమ తమ ఆచారాల ప్రకారం తమవారి మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఊర్లో ఎవరు చనిపోయినా అంతిమయాత్రలో మాత్రం అన్ని మతాల వారూ పాల్గొంటారు.

"చనిపోయినవారి మతంతో సంబంధం లేకుండా... అన్ని మతాల వారూ అంత్యక్రియలకు హాజరవుతారు. మేం హిందువుల దహన సంస్కారాలకు వెళ్తాం. మేం చేసే జనాజాలో వాళ్లూ పాల్గొంటారు. క్రిస్టియన్ల ఖననం జరిగేటప్పుడు కూడా మేం వెళ్తాం. మేమంతా ఒక పడవలో ప్రయాణం చేస్తున్నవాళ్లమే కదా. చివరికి అందరం మట్టిలో కలిసిపోవాల్సిందే. ఇదే పద్ధతిని అంతటా పాటిస్తే బాగుంటుందన్నది నా అభిప్రాయం."

-ఇమ్రాన్ హుస్సేన్, స్థానికుడు

"నేను హిందువుని. క్రిస్టియన్ అయినా, హిందూ అయినా, ముస్లిం అయినా ఇక్కడే అంత్యక్రియలు నిర్వహిస్తారు. మా మధ్య కులమతాల అంతరాలు లేవు. ఏ మతానికి చెందినవారైనా అంతిమ సంస్కారాలు ఇక్కడే నిర్వహించుకోవచ్చు."

-ప్రశాంత గొగోయ్, స్థానికుడు

సాధారణంగా ఎక్కడైనా వివిధ మతాలవారికి ప్రత్యేక శ్మశానవాటికలుంటాయి. గోరాజన్‌లో ఉన్న ఈ శ్మశాన వాటిక వాటన్నింటి కంటే భిన్నం. ఈ ప్రాంతంలో మతఘర్షణలు, విద్వేషపూరిత కల్లోలాలు జరిగిన దాఖలాలే లేవు. 1933లో తమ పూర్వీకులు ప్రారంభించిన ఈ పద్ధతినే ఇప్పటికీ అనుసరిస్తూ.. గోరాజన్ ప్రజలు మతసామరస్యాన్ని చాటిచెప్తున్నారు.

ఇదీ చదవండి:పదేళ్లుగా 'కరోనా'తో ఆనందాల కాపురం

ABOUT THE AUTHOR

...view details