అసోం-మిజోరం మధ్య భగ్గుమన్న సరిహద్దు వివాదం.. సుప్రీంకోర్టుకు చేరే అవకాశం కనిపిస్తోంది. ఇరు రాష్ట్రాలకు సరిహద్దుగా భావిస్తున్న అంతర్గత అడవుల పరిరక్షణ కోసం దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు అసోం సీఎం హిమంత బిశ్వశర్మ తెలిపారు. నిషేధిత ప్రాంతంలో రోడ్ల నిర్మాణంతో పాటు ఝూమ్ సాగు కోసం చెట్లు నరికివేస్తున్నట్లు శాటిలైట్ చిత్రాల ద్వారా బయటపడినట్లు హిమంత తెలిపారు. అటవీ ప్రాంతాన్ని కాపాడేందుకు సుప్రీంకోర్టుకు వెళ్లనున్నట్లు చెప్పారు.
"అడవులను కాపాడాలని కోరుతూ.. సుప్రీంకోర్టుకు వెళ్లనున్నాం. ఇది భూ వివాదం మాత్రమే కాదు. అటవీ సంపద ఆక్రమణ సమస్య. అటవీ సంపదకు సంబంధించి రాజీపడేది లేదు. ఒకవేళ మిజోరం ఆధారాలు చూపిస్తే.. ఆ ప్రాంతాన్ని వెంటనే ఖాళీ చేయిస్తాం."
- హిమంత బిశ్వ శర్మ, అసోం సీఎం
ఝూమ్ సాగు అంటే.. వ్యవసాయ కార్యకలాపాల కోసం చెట్లు, ఇతర వృక్ష సంపదను నరికి నిప్పుపెడతారు. ఈశాన్య రాష్ట్రాల్లో చాలావరకు ఈ తరహా వ్యవసాయాన్ని అనుసరిస్తున్నారు.
అంగుళం కూడా వదలం...
ఒక్క అంగుళం భూమి కూడా వదులుకునేందుకు సిద్ధంగా లేమని హిమంత స్పష్టం చేశారు. ప్రజలు ఎన్నో త్యాగాలు చేశారని, ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరిహద్దును కాపాడుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఇందుకు మిజోరం సరిహద్దుల్లో భద్రతను బలోపేతం చేసేందుకు కాచర్, కరీమ్గంజ్, హైలాకాండి జిల్లాల్లో మూడు కమాండో బెటాలియన్లను మోహరించనున్నట్లు హిమంత తెలిపారు.
మూడు రోజులపాటు సంతాప దినాలు