అసోంలో ఓ ప్రైవేట్ యూనివర్సిటీలో ర్యాగింగ్ భూతం ఓ విద్యార్థి ప్రాణాల మీదకు తెచ్చింది. సీనియర్ విద్యార్థులు చేసే ర్యాగింగ్ నుంచి తప్పించుకోవడానికి ఓ జూనియర్ రెండంతస్తుల హాస్టల్ భవనంపై నుంచి దూకాడు. దీంతో అతడికి తీవ్రంగా గాయాలయ్యాయి. గత నాలుగు నెలలుగా సీనియర్ విద్యార్థులు తమ కుమారుడ్ని చిత్రహింసలకు గురిచేసి.. చంపడానికి ప్రయత్నించినట్లు బాధితుడి తల్లి ఆరోపించింది. దీనిపై యూనివర్సిటీ యాజమాన్యం స్పందించి ర్యాగింగ్‌కు పాల్పడిన 18 మంది సీనియర్ విద్యార్థులను వెంటనే సస్పెండ్ చేసింది. ఈ ఘటనపై సీఎం హిమంత బిశ్వశర్మ కూడా స్పందించారు.
గువాహటిలోని దిబ్రూగఢ్ యూనివర్సిటీలో ఆనంద్ శర్మ అనే ఓ జూనియర్ విద్యార్థి రెండంతస్తుల హాస్టల్ భవనంపై నుంచి దూకాడు. నవంబర్ 26 రాత్రి యూనివర్సిటీ బాయ్స్ హాస్టల్లో కొందరు సీనియర్లు ఆనంద్‌ను తీవ్రంగా కొట్టగా.. వారినుంచి తప్పించుకోవడానికి ఇలా చేయాల్సి వచ్చింది. దీంతో అతడికి తీవ్రంగా గాయలయ్యాయి. వెంటనే గాయపడిన ఆనంద్‌ను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
గత నాలుగు నెలలుగా డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదివే తమ కుమారుడ్ని కొందరు సీనియర్ విద్యార్థులు చిత్రహింసలకు గురిచేసి.. హత్య చేయడానికి ప్రయత్నించారని బాధితుడి తల్లి సరిత ఆరోపించారు. ఈ దారుణానికి కారణమైన విద్యార్థులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కొందరు స్టూడెంట్స్ డిమాండ్ చేశారు. ఈ ఘటనపై స్పందించిన యూనివర్సిటీ యాజమాన్యం దీనితో సంబంధం ఉన్న.. 18 మంది సీనియర్ విద్యార్థులను కాలేజీ నుంచి సస్పెండ్ చేసి.. వెంటనే వారి హాస్టల్ గుర్తింపును కూడా రద్దు చేస్తున్నట్లు తెలిపింది. వారిలో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ ఘటనపై అసోం సీఎం హిమంత బిశ్వశర్మ స్పందించి ఓ ట్వీట్ చేశారు.
'దిబ్రూగఢ్ యూనివర్సిటీలో ర్యాగింగ్ జరిగి.. ఓ విద్యార్థి గాయపడినట్లు తెలిసింది. దీనిపై వెంటనే జిల్లా యంత్రాంగంతో మాట్లాడాను.. వారు నిందితులపై చర్యలు తీసుకుంటారు. పోలీసులు నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రస్తుతం బాధితుడికి అత్యవసర వైద్యసేవలు అందిస్తున్నాం. విద్యార్థులంతా ర్యాగింగ్‌కు నో చెప్పాలని నా విజ్ఞప్తి.'
-- హిమంత బిశ్వశర్మ, అసోం ముఖ్యమంత్రి
రన్నింగ్ ట్రైన్‌పై రాళ్లు రువ్విన ఆకతాయిలు..
మహారాష్ట్రలో కొందరు ఆకతాయిలు రన్నింగ్ ట్రైన్‌పై రాళ్ల దాడి చేశారు. ఈ ఘటనలో ఓ మహిళా ప్రయాణికురాలు గాయపడింది. సోమవారం ఉదయం ఆంబివలీ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ దాడి జరిగింది. కొంతమంది ఆకతాయిలు కల్యాణ్-కాసర రైల్వే లైన్లో వెళ్తున్న ఓ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్లు విసిరారు. ఈ ఘటనలో దివా ప్రాంతానికి చెందిన 55 ఏళ్ల రఖ్మాహబాయి పాటిల్ అనే మహిళ కంటికి గాయమైంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు. గతంలోనూ అదే ప్రాంతంలో.. ఇలాంటి ఘటనే జరిగినట్లు తెలిపారు.